Telugu Global
Telangana

'కారు గుర్తుకే ఓటేస్తాం.. కాంట్రాక్టర్ పువ్వులు మా ఇంటికి రాకండి'

'మా ఇంటికి ఎవరూ రాకండి.. నెలనెలా ఫించన్ ఇస్తుండు.. కేసీఆర్‌కే వేస్తాను.. ఆయన నా కొడుకు' అని ఆ ఇంటి యజమానురాలు చెప్తోంది.

కారు గుర్తుకే ఓటేస్తాం.. కాంట్రాక్టర్ పువ్వులు మా ఇంటికి రాకండి
X

మునుగోడు ఉపఎన్నికలో అభ్యర్థుల ప్రచారం ఊపందుకున్నది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంటింటికీ తిరిగి తమకు ఓట్లేయాలని అడుగుతున్నారు. ఈ క్రమంలో కొంత మందికి చిత్రవిచిత్రమైన సంఘటనలు ఎదురవుతున్నాయి. ఓట్లు అడిగతే కొంత మంది మేం ఫలానా పార్టీకే వేస్తాం అని మొఖం మీదే చెప్తున్నారు. గ్యాసు ధరలు పెంచిన బీజేపీకి ఓటేయ్యం అని కొంత మంది బోర్డులు పెట్టారు. తాజాగా ఓ గ్రామంలో ఏకంగా కారు గుర్తుకే ఓటేస్తామనే బోర్డు చూసి ఇతర పార్టీల నాయకులు ఖంగు తిన్నారు. కాగా, కొంత మంది అసలు టీఆర్ఎస్‌కు ఓటేస్తామని బోర్డెందుకు పెట్టారని అడగగా.. ఆ ఇంటి యజమానైన ఓ వృద్ధురాలు ఆసక్తికరమైన విషయాలు చెప్పింది.

'మా ఇంటికి ఎవరూ రాకండి.. నెలనెలా ఫించన్ ఇస్తుండు.. కేసీఆర్‌కే వేస్తాను.. ఆయన నా కొడుకు' అని ఆ ఇంటి యజమానురాలు చెప్తోంది. ఇంటి ముందు పెట్టిన బోర్డుపై మా ఇంట్లో పెద్దాయనకు ఆసరా పెన్షన్ వస్తుంది. మా ఇంట్లో అందరి ఓటు కారు గుర్తుకే.. దయచేసి కాంట్రాక్టర్ పువ్వులు మా ఇంటికి రాకండి అని రాసి ఉండటం గమనార్హం. ఇలాంటి చిత్ర విచిత్రమైన బోర్డులు మునుగోడులోని చాలా గ్రామాల్లోని ఇండ్ల ముందు వెలిశాయి. దీంతో ఇతర పార్టీ నేతలు వారి గుమ్మం తొక్కి ఓటు అడగాలంటే సందేహిస్తున్నారు.



నామినేషన్ల గడువు కూడా తీరిపోవడంతో ఇక ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ఉదృతం చేశాయి. ఇంటింటికీ తిరిగి ఓట్లు అడుగుతున్నారు. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు వాహనాలపై తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మాత్రం ఇంటింటికి స్వయంగా తిరుగుతున్నారు. స్థానికురాలినైన తనను గెలిపించాలని కోరుతున్నారు. ఇంటి ఆడబిడ్డలా నియోజకవర్గాన్ని పాలిస్తానని చెబుతున్నారు. ఆమె తరపున శనివారం ములుగు ఎమ్మెల్యే సీతక్క డప్పు కొడుతూ ప్రచారం చేశారు.


First Published:  16 Oct 2022 9:41 AM IST
Next Story