రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై దొమ్మరల ఆగ్రహం..
ఎస్సీ, ఎస్టీ, బీసీల పట్ల ముఖ్యంగా సంచార జాతుల పట్ల కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య ధోరణికి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని అన్నారు దొమ్మర సంఘం నేతలు.
ఉచిత విద్యుత్ వ్యవహారంలో ఇప్పటికే తెలంగాణ రైతాంగానికి టార్గెట్ అయిన రేవంత్ రెడ్డి.. మంత్రి కేటీఆర్ ని విమర్శించే క్రమంలో నోరు జారారు. దొమ్మర కులస్తులకు ఆగ్రహం తెప్పించేలా వ్యాఖ్యలు చేశారు. ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి.. దొమ్మర అనే పదాన్ని వాడటంపై ఆ కులసంఘం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల్లోగా రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కితీసుకోవాలని, తెలంగాణ రాష్ట్ర దొమ్మర సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే దొమ్మరలు రేవంత్ రెడ్డికి చెప్పు దెబ్బలతో సమాధానం చెప్పడంతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలకు దొమ్మరలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
రేవంత్ రెడ్డి రెడ్డి కుల దురహంకారంతో మదమెక్కిన ఆంబోతులా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజ మెత్తారు దొమ్మరల సంఘం రాష్ట్ర వ్యాప్త అధ్యక్షుడు ఆరే రాములు. రెడ్డి సామాజికవర్గమే పరమావధిగా సాగుతున్న రేవంత్ రెడ్డి అహంకారానికి సబ్బండ సంచార జాతులు రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతాయని హెచ్చరించారు. పనిచేసే ప్రభుత్వానికి, పని చేసే నాయకత్వానికి సంచారజాతుల మద్దత్తు ఎప్పుడూ ఉంటుందన్నారు. దొమ్మర గంతులు వేయడం, దొమ్మర గుడిసెల్లో దూరడం వంటి పదాలను పరిపాటిగా వాడుతూ తమ కులాన్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఆరే రాములు.
ఎస్సీ, ఎస్టీ, బీసీల పట్ల ముఖ్యంగా సంచార జాతుల పట్ల కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య ధోరణికి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని అన్నారు దొమ్మర సంఘం నేతలు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే ఆయుధాలుగా తమను వాడుకుంటూ, తమ కులాలను అవహేళన చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అందుకే వచ్చే ఎన్నికల్లో దొమ్మరలు, వంశరాజులు, పిచ్చుకకుంట్ల, గంగిరెద్దుల సహా సబ్బండ సంచార జాతి వర్గాలు కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. దేశంలో, రాష్ట్రంలో కనుమరగవుతున్న కాంగ్రెస్ పార్టీకి దళితులు, సంచార జాతులు దూరంగానే ఉంటున్నాయని, ఇకపై కూడా ఉంటాయని పేర్కొన్నారు దొమ్మర సంఘం నేతలు.