బహిరంగ సభలు, భారీ కమిటీలు సరే.. బీజేపీకి అభ్యర్థులున్నారా?
ఆరు వేల దరఖాస్తులు వచ్చినప్పుడు వాటిలో నుంచి 119 స్థానాలకు బలమైన అభ్యర్థులను ఎంచుకోవాలంటే ఏ పార్టీకయినా చాలా కష్టం. కానీ, బీజేపీ పరిస్థితి వేరు.
మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ల్లో ఏకంగా ప్రధాని మోడీతో సభలు.. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డ రాక, నేడు హోం మంత్రి అమిత్‌షా రాక.. ఇప్పటికే రెండు, మూడు రకాలుగా జంబో కమిటీలు.. ఈ హడావుడి చూసేవారికి బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేస్తుంది కాబోలు అనిపించకమానదు. వాస్తవంగా చూస్తే బీజేపీ తెలంగాణలో ఎక్కడా రేసులో ఉన్నట్లే కనపడదు. అసలా పార్టీకి 119 స్థానాల్లో అభ్యర్థులున్నారా..? అంటే అనుమానమే. నోటిఫికేషన్ వచ్చేసినా ఆ పార్టీ నాయకులు అభ్యర్థుల జాబితా గురించి ఎక్కడా స్పష్టమైన ప్రకటన చేయకపోవడం ఇందుకు నిదర్శనం.
6వేల అప్లికేషన్లు వచ్చాయని హడావుడి
కాంగ్రెస్ మాదిరిగానే బీజేపీ కూడా అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు ఆహ్వానించింది. కాంగ్రెస్‌ను మించి దరఖాస్తులు పోటెత్తాయి. 119 స్థానాల్లో అభ్యర్థిత్వం కోసం మొత్తం 6,003 అప్లికేషన్లు వచ్చాయని కమలం పార్టీ ప్రకటించింది. దీంతో వారిలో నుంచి అభ్యర్థులను ప్రకటిస్తుందని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అప్లికేషన్ల తతంగం ముగిసి నెల రోజులవుతున్నా కమలదళంలో ఇప్పటికీ అదే నిశ్శబ్దం కొనసాగుతోంది.
సమర్థులైన అభ్యర్థులు లేరట మరి!
ఆరు వేల దరఖాస్తులు వచ్చినప్పుడు వాటిలో నుంచి 119 స్థానాలకు బలమైన అభ్యర్థులను ఎంచుకోవాలంటే ఏ పార్టీకయినా చాలా కష్టం. కానీ, బీజేపీ పరిస్థితి వేరు. ఇందులో చాలావరకూ అసెంబ్లీకి కాదు కదా మున్సిపల్ కౌన్సిలర్, కార్పొరేటర్ స్థాయికి కూడా తూగని వారి నుంచి వచ్చినవేనని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. ఉదాహరణకు హైదరాబాద్‌లోని ఓ మహిళా కార్పొరేటర్ నగరంతోపాటు చుట్టుపక్కల మహేశ్వరం లాంటి నియోజకవర్గాలు మొత్తం నాలుగింటికి అప్లికేషన్లు వేశారు. ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఏ ధైర్యంతో ఇవ్వగలమన్నది ఆ పార్టీ నేతల ఆలోచన. ఇక గ్రామస్థాయి, మండల స్థాయిలో కాస్త పేరున్న కార్యకర్తలు కూడా తండోపతండాలుగా వచ్చి అప్లికేషన్లు వేసేశారు. వీరిలో అత్యధిక మందికి అసెంబ్లీ ఎన్నికల ఖర్చును ఒక్కరోజు కూడా మోయగలిగే శక్తి లేదు.
ఆ గుప్పెడు మంది నేతలే బరిలోకి!
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జాతీయస్థాయికి పంపిన సంజయ్, లక్ష్మణ్.. మధ్యలో వచ్చిన ఈటల, డీకే అరుణ, రాజగోపాల్‌రెడ్డి.. టికెట్ ఇవ్వాలంటే కనిపిస్తున్న నేతలు ఇలా పిడికెడు మందే. కిషన్‌రెడ్డి, సంజయ్, సోయం బాపురావు లాంటి ఎంపీలను అసెంబ్లీ బరిలోకి దింపుతారా? ఒకవేళ దింపినా పేరున్న ఆ పది మంది నేతల వరకు ఓకే. మిగిలిన స్థానాల్లో అభ్యర్థులు మళ్లీ నామ్‌కే వాస్తే బ్యాచేనా? ఇవీ ఇప్పుడు కమలదళంలో మెదులుతున్న ప్రశ్నలు.