Telugu Global
Telangana

గెలుపు మాట దేవుడెరుగు.. 119 స్థానాల్లో అభ్యర్థులున్నారా..?

ఇక తెలంగాణలో బీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకున్న బీజేపీ.. ఇప్పుడు ఆభ్యర్థులను వెతుక్కునే పనిలో పడింది. తెలంగాణ మొత్తంలో బీజేపీకి 25 నుంచి 30 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులున్నారు.

గెలుపు మాట దేవుడెరుగు.. 119 స్థానాల్లో అభ్యర్థులున్నారా..?
X

మొన్నటి వరకు తెలంగాణలో బీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అన్న బీజేపీ.. ఇప్పుడు చల్లబడింది. ప్రత్యామ్నాయం తామే అని భావించిన ఆ పార్టీ అంచనాలు తలకిందులయ్యాయి. ఇక 119 నియోజకవర్గాల్లో 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి బీజేపీ షాక్‌ ఇచ్చింది బీఆర్ఎస్‌. కారు పార్టీలో సీటు దొరకని అసమ్మతులు వస్తే తమ పార్టీలో చేర్చుకుందాని చూసిన బీజేపీ ఆశలపై గులాబీ బాస్‌ కేసీఆర్‌ నీళ్లు చల్లారు. దాదాపు 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ.. రెండు, మూడు చోట్ల మినహా.. మిగతా చోట్ల పెద్దగా అసంతృప్తి కనిపించలేదు. ఇక టికెట్లు దక్కిన వారు ఇప్పటికే ప్రచారంలో మునిగిపోయారు.

ఇక తెలంగాణలో బీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకున్న బీజేపీ.. ఇప్పుడు ఆభ్యర్థులను వెతుక్కునే పనిలో పడింది. తెలంగాణ మొత్తంలో బీజేపీకి 25 నుంచి 30 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులున్నారు. ఇక ఉన్నవారిలో బలమైన అభ్యర్థులు ఎంతమందంటే వేళ్ల మీద లెక్క పెట్టాల్సిన పరిస్థితి. బీఆర్ఎస్‌ నుంచి అసంతృప్తులు తమ పార్టీలోకి వస్తారనుకున్న బీజేపీకి ఆ ఆశ నెరవేరలేదు. కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలుపుతో పాటు బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత ఆ పార్టీ అంచనాలు తారుమారయ్యాయి. ఆ పార్టీలో చేరే నేతలే కరవయ్యారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన అమిత్ షా సభలోనూ 20 మందికి పైగా నేతలు చేరతారని ప్రచారం జరిగినప్పటికీ.. ఒక్కరు కూడా కాషాయ కండువా కప్పుకోలేదు.

ఇక ఎంపీలు, పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు సైతం అసెంబ్లీ బరిలో ఉండాలని అధిష్టానం ఆదేశించింది. దీంతో ప్రస్తుతం ఉన్న నలుగురు సిట్టింగ్‌ ఎంపీలు అసెంబ్లీకి పోటీ చేయాల్సిన పరిస్థితి. అయితే పలువురు నేతలు అసెంబ్లీకి పోటీ చేసేందుకు ఆసక్తి చూపట్లేదని సమాచారం. ఇక పార్టీలో చేరికలు లేకపోగా మరోవైపు నేతలు పార్టీని వీడుతుండటం కమలం నేతలను కలవరపెడుతోంది. ఇటీవల మాజీ మంత్రి చంద్రశేఖర్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన్ని కమలం పార్టీకి గుడ్‌ బై చెప్పారు. ఇంకా చాలా మంది నేతలు సైలెంట్ అయిపోయారు. మరో డజను మందికిపైగా నేతలు సైతం కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు సమాచారం. అన్ని కుదిరితే వారం, పది రోజుల్లో వీరంతా కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో 107 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు కోల్పోయింది. అయితే తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ నాలుగు లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. జీహెచ్‌ఎంసీలో 40కి స్థానాలు గెలుచుకుని రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్‌ ఎంత వేగంగా పుంజుకుందో.. ఇటీవల జరిగిన పరిణామాలతో అంతే వేగంగా పడిపోయింది.

*

First Published:  31 Aug 2023 6:50 PM IST
Next Story