Telugu Global
Telangana

ఆరోగ్య తెలంగాణ దిశగా వైద్యులు కృషి చేయాలి : మంత్రి హరీశ్ రావు

ప్రపంచ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్లు మెరుగైన సేవలు అందించడం వల్ల ఆరోగ్య తెలంగాణను సాధించవచ్చని చెప్పారు.

ఆరోగ్య తెలంగాణ దిశగా వైద్యులు కృషి చేయాలి : మంత్రి హరీశ్ రావు
X

ఆరోగ్య తెలంగాణ దిశగా వైద్యులు కృషి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల వైద్య సేవలు, పరీక్షలు ఉచితంగా అందిస్తోందని వైద్యరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. టీ-డయాగ్నస్టిక్స్ సేవలు విస్తరణకు రంగారెడ్డి జిల్లా కొండాపూర్ ఏరియా ఆసుపత్రి వేదికగా వర్చువల్ మోడ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాథాలజీ, రేడియాలజీ హబ్‌లను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..

ప్రపంచ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్లు మెరుగైన సేవలు అందించడం వల్ల ఆరోగ్య తెలంగాణను సాధించవచ్చని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ డాక్టర్లు అద్బుతంగా పని చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు ప్రశంసించారు. ప్రజలు ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేలా ప్రజాప్రతినిధులు కూడా పని చేయాలని మంత్రి సూచించారు.

ఆరోగ్య మహిళ, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ లాంటి పథకాలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీల సంఖ్య పెరిగింది. నిమ్స్ ఆసుపత్రిలో త్వరలోనే రోబోటిక్ మెషిన్‌ను కూడా ప్రారంభించుకోబోతున్నట్లు మంత్రి హరీశ్ రావు వివరించారు. ఇవ్వాల్టి నుంచి టీ-డయాగ్నస్టిక్స్ ద్వారా 134 పరీక్షలు ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. అన్ని పీహెచ్‌సీల్లో ఉచితంగానే పరీక్షలు నిర్వహిస్తామని.. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి కార్యక్రమం లేదని మంత్రి వెల్లడించారు.

రాష్ట్రంలోని 31 జిల్లాల్లో టీ-డయాగ్నస్టిక్స్ కేంద్రాలు, రేడియాలజీ సెంటర్ల అందుబాటులోకి వచ్చాయని మంత్రి చెప్పారు. మరో రెండు జిల్లాల్లో పనులు జరుగుతున్నాయి. త్వరలో వాటిని కూడా ప్రారంభిస్తామని హరీశ్ రావు పేర్కొన్నారు. కరోనా సమయంలో వైద్యులు ప్రాణాలకు తెగించి పని చేశారని, ప్రజలను మహమ్మారి బారి నుంచి రక్షించారని వెల్లడించారు. రాష్ట్రంలో వైద్యుల పని తీరు అద్భుతంగా ఉందన్నారు. వైద్యరంగంలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిచేలా కృషి చేసిన డాక్టర్లందరికీ.. వరల్డ్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

First Published:  1 July 2023 1:25 PM IST
Next Story