నేను ఇంత అందంగా ఎలా ఉన్నానో తెలుసా..? - మహిళలకు స్మిత సబర్వాల్ చిట్కాలు
కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని, మహిళ ఆరోగ్యం దెబ్బతింటే కుటుంబం మొత్తం ఇబ్బంది పడుతుందని స్మిత సబర్వాల్ వ్యాఖ్యానించారు.
సీనియర్ ఐఏఎస్, సీఎంవో అధికారిణి స్మిత సబర్వాల్ మహిళలకు కీలక సూచనలు చేశారు. నిజామాబాద్ లో పర్యటించిన ఆమె అక్కడి గర్భిణీలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. మహిళలు పౌష్టికాహారం తీసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు.
తల్లి ఆరోగ్యం బాగుంటే పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పారు. మహిళలు ఉద్యోగం, కుటుంబం, పిల్లల బాధ్యత అన్ని ఒకేసారి నిర్వర్తించాల్సి వస్తుందని, వాటన్నింటినీ సమర్థవంతంగా నిర్వర్తించాలంటే ఆరోగ్యంగా ఉండటం ముఖ్యమన్నారు. అలా ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన ఆహారం తీసుకోవాలని చెప్పారు. తల్లి అవ్వడం మహిళలకు ఒక వరం లాంటిదన్నారు.
ఈ సందర్భంగా ఒక గర్భిణీ స్మితా సబర్వాల్ ని ఉద్దేశించి మీరు చాలా అందంగా ఉంటారు మేడం అని వ్యాఖ్యానించారు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి. సదరు మహిళకు థాంక్స్ చెప్పిన స్మిత సబర్వాల్ తాను ఇలా అందంగా, ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతున్నానో తెలుసా..? అంటూ తన ఆరోగ్య రహస్యాన్ని మహిళలతో పంచుకున్నారు.
తానేమి తక్కువ వయసున్న మహిళను కాదని, తన వయసు మీ వయసుతో పోలిస్తే డబుల్ ఉంటుందని గర్భిణీలతో స్మిత సబర్వాల్ చెప్పారు. తాను మదర్ హార్లిక్స్, ఖర్జూరాలతో పాటు ఇప్పుడు ప్రభుత్వం గర్భిణీలకు ఇస్తున్న ఐటమ్స్ అన్నింటిని తీసుకోవడం వల్లనే తాను ఇలా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నానని చెప్పారు. తన పెద్ద కుమారుడు వయసు ప్రస్తుతం 18 సంవత్సరాలని చెప్పారు.
కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని, మహిళ ఆరోగ్యం దెబ్బతింటే కుటుంబం మొత్తం ఇబ్బంది పడుతుందని స్మిత సబర్వాల్ వ్యాఖ్యానించారు. మహిళలకు ఫిజికల్ గా, మెంటల్ గా అనేక సవాళ్లు ఉంటాయని, వాటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ముందు ఆరోగ్యంగా ఉండడం అత్యవసరమన్నారు.