ఒక్క మాట మీడియా ముందు మాట్లాడ వద్దు.. టీ-కాంగ్రెస్ నాయకులకు అధిష్టానం హెచ్చరిక
ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ ముఖ్య నాయకులతో అధిష్టానం మంగళవారం కీలకమైన స్ట్రాటజీ మీటింగ్ నిర్వహించింది.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ నాయకులకు ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. ఇకపై అధిష్టానం తీసుకునే నిర్ణయాలు, ఇచ్చే సూచనలను మీడియా ముందు కానీ, సన్నిహితుల వద్ద కానీ వెల్లడించ వద్దని స్పష్టం చేసింది. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రతీ ఒక్కరు కష్టపడాల్సిందే అని.. కర్ణాటకలో అవలంభించిన ఫార్ములానే రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని స్పష్టం చేసింది.
ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ ముఖ్య నాయకులతో అధిష్టానం మంగళవారం కీలకమైన స్ట్రాటజీ మీటింగ్ నిర్వహించింది. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు పలు హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీలో అధిష్టానంతో జరిగిన సమావేశంలో మాట్లాడిన మాటలు ఏవీ కూడా బయట మీడియా ముందు గానీ, సన్నిహితుల వద్ద కానీ చర్చించ వద్దని స్పష్టం చేసింది.
తెలంగాణ ఎన్నికల కోసం 120 రోజుల ప్రణాళికను అధిష్టానం వెల్లడించింది. కర్ణాటకలో ఏ ఫార్ములాతో అయితే ముందుకు వెళ్లామో.. అదే రీతిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కూడా కాంగ్రెస్ సమాయత్తం కావాలని అధిష్టానం చెప్పింది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీ కొన్ని సూచనలు చేసింది. అందరూ కలిసి కట్టుగా పని చేయాలని.. ఇప్పుడే టికెట్ల గురించి చర్చించాల్సిన అవసరం లేదని తెలిపింది. అధిష్టానంతో జరిగిన సమావేశంలో పాల్గొన్న నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు ఈ విషయాలు వెల్లడించ వద్దని సూచించింది.
ఏఐసీసీ కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్‌తో జరిగిన సమావేశం అనంతరం.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని చూస్తున్నాయని చెప్పారు. ఆ రెండు పార్టీల మధ్య లోపాయకారి ఒప్పందం కుదిరిందని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజల డబ్బంతా ఒక పార్టీ ప్రచార ఖర్చులకే పోతోందని ఆరోపించారు. తెలంగాణలోని గడపగడపకు వెళ్లి కాంగ్రెస్‌కు ఓటేయమని అభ్యర్థిస్తామని చెప్పారు.
టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ఏం చేయనున్నదో త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అభిప్రాయాలు అన్నీ తెలుసుకున్నది. కొన్నింటిని స్వీకరించింది.. మరి కొన్నింటిపై సూచనలు చేసిందని అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలంతా ఏకంగా ఉన్నారు. అందరం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు.
LIVE: Press briefing by Shri Revanth Reddy and senior leaders from Telangana at AICC HQ. https://t.co/88EPJkKbSk
— Congress (@INCIndia) June 27, 2023