Telugu Global
Telangana

రాహుల్ గాంధీకి పాస్‌పోర్ట్ మంజూరు చేయవద్దు.. కోర్టుకు సుబ్రహ్మణ్య స్వామి వినతి

2015 నుంచి బెయిల్‌పై రాహుల్ ఉన్నారని.. ఇలాంటి సమయంలో ఆయనకు పాస్‌పోర్ట్ మంజూరు కోసం ఎన్‌వోసీ ఇవ్వవద్దని కోర్టును సుబ్రహ్మణ్య స్వామి కోరారు.

రాహుల్ గాంధీకి పాస్‌పోర్ట్ మంజూరు చేయవద్దు.. కోర్టుకు సుబ్రహ్మణ్య స్వామి వినతి
X

కాంగ్రెస్ పార్టీ నాయకుడు, లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన రాహుల్ గాంధీకి పాస్‌పోర్ట్ మంజూరు చేయవద్దని ఢిల్లీ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టును బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కోరారు. రాహుల్ గాంధీ లోక్‌సభ నుంచి సస్పెండ్ అవడంతో తనకు ఉన్న దౌత్య పాస్‌పోర్టును సరెండర్ చేశారు. దానికి బదులుగా సాధారణ పాస్‌పోర్ట్ కోసం ధరఖాస్తు చేసుకుంటానని, అందుకు అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేయాలని కోరుతూ ఢిల్లీ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు.

కాగా, రాహుల్ గాంధీపై మోడీ పేరుతో చేసిన వ్యాఖ్యల పరువు నష్టం కేసు మాత్రమే కాకుండా.. తాను వేసిన నేషనల్ హెరాల్డ్ కేసులో కూడా నిందితుడిగా ఉన్నట్లు సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు. 2015 నుంచి బెయిల్‌పై రాహుల్ ఉన్నారని.. ఇలాంటి సమయంలో ఆయనకు పాస్‌పోర్ట్ మంజూరు కోసం ఎన్‌వోసీ ఇవ్వవద్దని కోర్టును సుబ్రహ్మణ్య స్వామి కోరారు.

అయితే, 2015లో బెయిల్ మంజూరు చేసిన సమయంలో రాహుల్ గాంధీపై ఎలాంటి ప్రయాణ ఆంక్షలు విధించలేదని.. అలాంటప్పుడు సాధారణ పాస్‌పోర్ట్ మంజూరు చేయడంలో అభ్యంతరం ఏముంటుందని కోర్టు ప్రశ్నించింది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే లిఖిత పూర్వకంగా కోర్టుకు తెలియజేయాలని చెప్పింది. ఈ కేసుకు సంబంధించిన విచారణను ఈ నెల 26కు వాయిదా వేస్తున్నట్లు కోర్టు పేర్కొన్నది.

First Published:  25 May 2023 10:20 AM IST
Next Story