ప్రభుత్వ భూమి అంగుళం కూడా ఆక్రమణకు గురికావొద్దు
నల్సార్ యూనివర్సిటీలో ఆదివారం నిర్వహించిన 33 జిల్లాల తహశీల్దార్లతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలు
సామాన్యులకు మేలు జరిగేలా రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ, సమాచారం శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నల్సార్ యూనివర్సిటీలో ఆదివారం నిర్వహించిన 33 జిల్లాల తహశీల్దార్లతో ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమి అంగుళం కూడా ఆక్రమణకు గురికాకుండా చూడాలన్నారు. రెవెన్యూ ఉద్యోగులకు ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.
రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు సానుకూలంగా పరిష్కరిస్తామని తెలిపారు. తహశీల్దార్ల బదిలీలపై త్వరలోనే ఉద్యోగ సంఘాలతో సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు జోడెద్దుల్లా పనిచేసి ప్రజలకు ఉత్తమ సేవలందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. ప్రభుత్వంలో అన్ని శాఖల కంటే రెవెన్యూ శాఖ ప్రత్యేకమైనదని, అన్ని సందర్భాల్లో ఈ శాఖ సిబ్బంది ప్రత్యేక పాత్ర పోషిస్తుందన్నారు. రాష్ట్రంలో మొత్తం 972 మంది తహశీల్దార్లు ఉన్నారు. గ్రామ, మండలస్థాయిలో ఉండే సమస్యలు, ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి ముఖాముఖి కార్యక్రమ ఏర్పాటు చేశామన్నారు. రెవెన్యూ చట్టాల సవరణకు.. క్షేత్రస్థాయిలో ఉండే సమస్యలపై మీరు ఇచ్చే సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకుంటామని పొంగులేటి తెలిపారు.