ఓపెన్ వర్సిటీ స్థలాన్ని జేఎన్‌ఎఫ్‌ఏయూకు కేటాయించొద్దు
వర్సిటీలో ఆందోళనకు దిగిన ప్రొఫెసర్లు, ఉద్యోగులు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ భూమిలో పది ఎకరాలను జవహర్ లాల్ నెహ్రూ అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఎఫ్‌ఏయూ)కు కేటాయించొద్దని డిమాండ్ చేస్తూ ప్రొఫెసర్లు, ఉద్యోగులు బుధవారం ఓపెన్ వర్సిటీ ఆవరణలో ఆందోళన చేపట్టారు. వర్సిటీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ పల్లవి కాబడే, కన్వీనర్ వడ్డాణం శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ జి. మహేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ, ఓపెన్ యూనివర్సిటీకి అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 53 ఎకరాల భూమిని జూబ్లీహిల్స్ లో కేటాయించిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం టీ శాట్ కోసం ఐదెకరాల భూమిని అనధికారికంగా కేటాయించిందని, కేబుల్ బ్రిడ్జి అభివృద్ధి కోసం నాలుగు ఎకరాలు తీసుకున్నారని తెలిపారు. దుర్గం చెరువులో మరో ఐదు ఎకరాలు మునిగిపోయిందని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులకు 35 ఎకరాల్లో విస్తరించి ఉన్న వర్సిటీ సేవలందిస్తుందని తెలిపారు. వర్సిటీ అవసరాల కోసం ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ సెంటర్ కోసం ప్రత్యేక భవనాలను నిర్మించాల్సి ఉందని, నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో వర్సిటీ స్థలాన్ని ఫైన్ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి కేటాయిస్తే ఓపెన్ యూనివర్సిటీ సేవలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతాయన్నారు. ఇకనైనా ప్రభుత్వం తన ఆలోచన విరమించుకోకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు రవీంద్రనాథ్, వెంకటేశ్వర్లు, నారాయణ రావు, బానోత్ ధర్మ, రుషేంద్రమణి, పుష్పా చక్రపాణి, మాధురి, మేరీ సునంద, వెంకట రమణ, ఎల్వీకే రెడ్డి, హబీబుద్దీన్, ప్రేమ్ కుమార్, యాకేశ్, రజనీ కాంత్, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.