Telugu Global
Telangana

కంటోన్మెంట్ పాక్షిక విలీనానికి ఒప్పుకోము : మున్సిపల్ మంత్రి కేటీఆర్

సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని కొన్ని పోష్ లొకాలటీలను తమ వద్దే ఉంచుకుంటామని.. రసూల్‌పుర, మారేడ్‌పల్లి సమీపంలోని కొన్ని ప్రాంతాలను మాత్రం ఇచ్చేస్తామని రక్షణ శాఖ చెప్పింది.

కంటోన్మెంట్ పాక్షిక విలీనానికి ఒప్పుకోము : మున్సిపల్ మంత్రి కేటీఆర్
X

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. కంటోన్మెంట్‌ను పాక్షికంగా జీహెచ్ఎంసీలో విలీనం చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. కంటోన్మెంట్‌ పరిధిలోని కొన్ని సివిలియన్ ప్రాంతాలను తమ వద్దే ఉంచుకొని.. మిగిలిన ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తామని కేంద్ర రక్షణ శాఖ చెప్పింది. అలా అయితే అసలు విలీనానికి ఒప్పుకోమని స్పష్టం చేసినట్లు మంత్రి కేటీఆర్ ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని కొన్ని పోష్ లొకాలటీలను తమ వద్దే ఉంచుకుంటామని.. రసూల్‌పుర, మారేడ్‌పల్లి సమీపంలోని కొన్ని ప్రాంతాలను మాత్రం ఇచ్చేస్తామని రక్షణ శాఖ చెప్పింది. జీహెచ్ఎంసీకి ఇచ్చేస్తామని చెప్పిన ప్రాంతాల్లో తాగునీరు, మురుగు నీటి వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. అలాంటి వాటిని మాత్రం అప్పగించేసి.. అభివృద్ధి చెందిన సివిలియన్ ప్రాంతాలను మాత్రం రక్షణ శాఖ వద్దే ఉంచుకుంటామని ప్రతిపాదించినట్లు కేటీఆర్ తెలిపారు.

కంటోన్మెంట్ పరిధిలో ఉన్న 2,600 ఎకరాల సివిలియన్ ప్రాంతాలను జీహెచ్ఎంసీకి బదిలీ చేయాలని కోరుతూ ఎనిమిది మంది సభ్యులతో రూపొందించిన నివేదికను ఇటీవలే కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి అందించారు. ఇందులో 350 రెసిడెన్షియల్ కాలనీలు, 16 బజార్లు, 414 ఎకరాల సెంట్రల్ గవర్నమెంట్ భూములు, 501 ఎకరాల లీజ్డ్ ల్యాండ్స్, 260 ఎకరాల ఖాళీ స్థలాలు ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు.

5,660 ఎకరాల డిఫెన్స్ ల్యాండ్ మాత్రం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు, లోకల్ మిలిటరీ అథారిటీతో ఉండేలా నివేదిక రూపొందించారు. కాగా, మరో కమిటీ మాత్రం 16 బజార్లు జీహెచ్ఎంసీతో విలీనం చేసి.. మిగిలినది కంటోన్మెంట్ బోర్డుతోనే ఉంచాలని ప్రతిపాదించింది.

దేశంలోని కంటోన్మెంట్ ప్రాంతాలన్నింటినీ ఆయా నగరాల నుంచి బయటకు తరలించాలని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కంటోన్మెంట్ ప్రాంతాల వల్ల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయిని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీని రూపొందించాలని మంత్రి కేటీఆర్ సూచించారు.

First Published:  2 July 2023 3:30 AM GMT
Next Story