Telugu Global
Telangana

డీకే శివకుమార్‌నే నమ్ముకున్న అధిష్టానం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర!

కాంగ్రెస్ పార్టీ డీకే శివకుమార్‌తో పాటు ఇతర ముఖ్యమైన నాయకులు, స్ట్రాటజిస్టులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేయనున్నది.

డీకే శివకుమార్‌నే నమ్ముకున్న అధిష్టానం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర!
X

మా నమ్మకం నువ్వే డీకే అంటోంది కాంగ్రెస్ అధిష్టానం. కర్ణాటక ఎన్నికల్లో తన వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టిన కేపీసీసీ అధ్యక్షుడు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌నే మరోసారి అధిష్టానం నమ్ముకుంటోంది. త్వరలో జరుగున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించే బాధ్యతను శివకుమార్ భుజాల పెట్టడానికి సిద్ధమైంది. రాష్ట్రంలోని అధికార బీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే కాంగ్రెస్‌కు ఒక సమర్థుడైన నాయకుడి అవసరం అధిష్టానం గుర్తించింది. బీఆర్ఎస్ వ్యూహాలకు సరైన ప్రతి వ్యూహాలు సిద్ధం చేసే నాయకుడు కేవలం శివకుమార్ అని భావిస్తోంది. ఎన్నికల స్ట్రాటజీలో శివకుమార్‌కు మించిన వారు లేరని భావించిన అధిష్టానం.. రాబోయే ఎన్నికల్లో ఆయనకు కీలక పాత్ర ఇవ్వబోతోందని తెలుస్తున్నది.

కాంగ్రెస్ పార్టీ.. డీకే శివకుమార్‌తో పాటు ఇతర ముఖ్యమైన నాయకులు, స్ట్రాటజిస్టులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేయనున్నది. కర్ణాటకలో అనుసరించిన వ్యూహాలనే తెలంగాణలో కూడా అమలు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే పలు సర్వేలకు సంబంధించిన డేటాను క్రోఢీకరిస్తున్నారు. దాని ప్రకారమే ఎలక్షన్ క్యాంపెయిన్, ఓటర్లను ఆకర్షించే పథకాలు ఉండబోతున్నట్లు తెలుస్తున్నది. ఏఐసీసీ అధికారికంగా ప్రకటించకపోయినా.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే డీకే శివకుమార్‌తో నిత్యం టచ్‌లో ఉంటున్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల వ్యూహకర్త సునిల్ కనుగోలు పెద్ద పాత్రనే పోషించారు. ఎన్నికల ప్రచారం, వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక విషయంలో సునిల్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ కోసం సునిల్ కనుగోలు టీమ్ పని చేస్తోంది. డీకే శివకుమార్‌కు కూడా సన్నిహితుడైన సునల్ కనుగోలు సేవలనే తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా వాడుకోనున్నారు. కర్ణాటకలో అవలంభించిన వ్యూహాలతో పాటు తెలంగాణలో అవసరమైన కొత్త స్ట్రాటజీలను కూడా రూపొందించనున్నారు. 2014 నుంచి బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో.. తప్పకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు పని కొస్తుందని.. ఆ ఓట్లు కాంగ్రెస్ వైపు తిరిగేలా వ్యూహం సిద్ధం చేయనున్నట్లు తెలుస్తున్నది. డీకే శివకుమార్‌తో గతంలోనే పరిచయం ఉన్న కొంత మంది సీనియర్ నాయకులు కూడా ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు.

2009లో ఉమ్మడి ఏపీలో రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తర్వాత తెలంగాణ, ఏపీలో ఆ పార్టీ తిరిగి అధికారం చేపట్టలేదు. ఆయన మరణానంతరం రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులయ్యారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి కారణంగా ఏపీ రెండు ప్రాంతాల్లో కూడా తీవ్రంగా నష్టపోయింది. వైఎస్ఆర్ వంటి నాయకుడిని కోల్పోవడం కాంగ్రెస్ పార్టీకి కూడా పెద్ద ఎదురు దెబ్బలా మారింది. అప్పటి నుంచి ఇరు రాష్ట్రాల్లో పార్టీ అధికారంలోకి రాలేకపోతోంది. దీంతో శివకుమార్‌ సేవలను వాడుకోవడం ద్వారా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కాలని అధిష్టానం భావిస్తోంది.

ఇప్పటికే అధిష్టానం డీకే శివకుమార్‌ను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంపై చర్చ జరిపినట్లు సమాచారం. దీనికి శివకుమార్ కూడా ప్రాథమికంగా సానుకూల స్పందన తెలియజేసినట్లు తెలుస్తున్నది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. తెలంగాణలో గెలిస్తే.. కేంద్రంలో కూడా అధికారంలోకి రావడానికి మార్గం సుగమమం అవుతుందని అంచనా వేస్తోంది. అందుకే కర్ణాటకలో విజయాన్ని అందించిన డీకే శివకుమార్ పైనే తెలంగాణ ఎన్నికల భారం పెట్టబోతోంది.

మొదట్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని భావించారు. బీజేపీ కూడా తమ మాటలతో అధికార బీఆర్ఎస్‌పై ఎటాక్ చేసింది. అయితే కర్ణాటక ఎన్నికల తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. బీజేపీ దూకుడు కళ్లెం పడగా.. కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకొని వచ్చింది. ప్రస్తుతం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అనేలా మాటల దూకుడు పెంచాయి. ఇదే ఊపును ఎన్నికల వరకు కొనసాగించాలని.. బీఆర్ఎస్‌కు సరైన ప్రత్యామ్నాయం తామే అని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ఇక త్వరలో డీకే కూడా రంగ ప్రవేశం చేస్తే.. తెలంగాణ కాంగ్రెస్‌లో మరింత ఉత్సాహం పెరగడం ఖాయమే.

First Published:  14 Aug 2023 10:28 AM IST
Next Story