Telugu Global
Telangana

దేవుళ్ల మీద కాదు, కుటుంబంపై ఒట్టు పెట్టగలవా..?

ప్రస్తుతం తెలంగాణలో రుణమాఫీ, రేవంత్ రెడ్డి ప్రమాణాలు, డెడ్ లైన్లు.. అనే అంశాలు హాట్ టాపిక్ గా ఉన్నాయి. కేసీఆర్ కూడా ఇదే విషయాన్ని ఇటీవల ప్రస్తావించారు. తాజాగా డీకే అరుణ కూడా రేవంత్ రెడ్డి ప్రమాణాలపై వ్యంగ్యాస్త్రాలు విసరడం విశేషం.

దేవుళ్ల మీద కాదు, కుటుంబంపై ఒట్టు పెట్టగలవా..?
X

సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లమీద ఒట్లు వేస్తూ ఓట్లు అడుగుతున్నారని, ఇదెక్కడి నీఛ రాజకీయం అని నిలదీశారు మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. ఎక్కడికెళ్తే అక్కడి దేవుళ్లపై ఆయన ఒట్లు వేస్తున్నారని, దేవుళ్లపై కాకుండా కుటుంబ సభ్యులపై ఆయన ప్రమాణం చేస్తే ప్రజలు నమ్ముతారని అన్నారు. అధికారం కోసం హామీలివ్వడం, ఆ తర్వాత మోసం చేయడం కాంగ్రెస్ కి అలవాటేనన్నారు. గతంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను మరోసారి గుర్తు చేశారు డీకే అరుణ.

రేవంత్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు ఏం చేశారో చెప్పకుండా తనపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు డీకే అరుణ. సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ స్థానంలో తనను ఓడించేందుకు ఆరుసార్లు అక్కడకు వచ్చారన్నారు. కాంగ్రెస్ లో ఓటమి భయం ఉంది కాబట్టే ఆయన అన్నిసార్లు పాలమూరుకు వస్తున్నారని చెప్పారు. డీకే అరుణతో తనకు పోటీ, పొంతన లేదన్న రేవంత్ వ్యాఖ్యలకు కూడా ఆమె కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డికి తాను పోటీకానప్పుడు తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారని, పదే పదే పాలమూరు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తిడతారని, ఆయన చెంచాలతో నీతి వాక్యాలు పలికిస్తుంటారని ఎద్దేవా చేశారు డీకే అరుణ.

ప్రస్తుతం తెలంగాణలో రుణమాఫీ, రేవంత్ రెడ్డి ప్రమాణాలు, డెడ్ లైన్లు.. అనే అంశాలు హాట్ టాపిక్ గా ఉన్నాయి. ఏ నియోజకవర్గానికి వెళ్తే ఆ నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న ఆలయాలను సందర్శించడం అక్కడ దేవుళ్లపై ఆయన ఒట్లు వేయడం చూస్తూనే ఉన్నాం. కేసీఆర్ కూడా ఇదే విషయాన్ని ఇటీవల ప్రస్తావించారు. తాజాగా డీకే అరుణ కూడా రేవంత్ రెడ్డి ప్రమాణాలపై వ్యంగ్యాస్త్రాలు విసరడం విశేషం.

First Published:  24 April 2024 3:01 PM IST
Next Story