ఆగస్ట్-15లోపు హామీలు నెరవేర్చకపోతే రేవంత్ రాజీనామా చేస్తారా..?
మమ్మల్ని పండబెట్టి తొక్కుతారంటా జాతి, రంగు గురించి మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడబిడ్డల గురించి అలా మాట్లాడతారా, ఇదేనా సంస్కారం అని ప్రశ్నించారు డీకే అరుణ.
ఆగస్ట్-15 లోపు రైతు రుణమాఫీ అంటూ కొత్త డెడ్ లైన్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ డెడ్ లైన్ తో ఆయనపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. హామీలు అమలు చేయడం చేతగాక ఆయన పలాయనం చిత్తగిస్తున్నారని అంటున్నారు బీఆర్ఎస్, బీజేపీ నేతలు. తాజాగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆగస్ట్-15 లోగా హామీలు అమలు చేయలేకపోతే సీఎం పదవికి ఆయన రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు.
నిన్న పాలమూరు అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. బీజేపీ అభ్యర్థి డీకే అరుణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె ఈరోజు అంతే ఘాటుగా బదులిచ్చారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. ఒక ఆడ బిడ్డను ఓడించేందుకు రాక్షసుల్లాగా, రాబందుల్లాగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అనే సోయిని మరిచి రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అన్నారు. పాలమూరు బిడ్డ ఈ ప్రాంతం కోసం అన్ని రంగాల్లో కృషి చేస్తే అసూయ పడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం ఏనాడైనా పోరాటం చేశారా? అని ప్రశ్నించారు డీకే అరుణ.
పండబెట్టి తొక్కుతారా..?
ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న రేవంత్ స్థాయి ఏంటి? అని ప్రశ్నించారు డీకే అరుణ. "నా బాగోతం ఏందో మీ బాగోతం ఏందో పాలమూరు చౌరస్తాలో తేల్చుకుందాం రండి" అంటూ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి స్థానాన్ని అగౌరవ పరిచేలా ఆయన మాట్లాడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి దొర అని, ఆయనది దొర కుటుంబం అని, తమది రైతు కుటుంబం అని చెప్పారు డీకే అరుణ. మమ్మల్ని పండబెట్టి తొక్కుతారంటా జాతి, రంగు గురించి మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడబిడ్డల గురించి అలా మాట్లాడతారా, ఇదేనా సంస్కారం అని ప్రశ్నించారు డీకే అరుణ.