కాంగ్రెస్‌ది మైండ్ గేమ్.. నేను పార్టీ మారడం లేదు - డీకే అరుణ
కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన నాయకులంతా తిరిగి సొంత గూటికి వస్తున్నారని ప్రచారం చేస్తోందని డీకే అరుణ విమర్శించారు. తాను పార్టీ మారే ప్రసక్తి లేదని, కాంగ్రెస్‌లో చేరబోనని చెప్పారు.
తాను పార్టీ మారడం లేదని.. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ క్లారిటీ ఇచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఉండి ఇప్పుడు బీజేపీలో కొనసాగుతున్న వివేక్, మర్రి శశిధర్ రెడ్డి, డీకే అరుణ తదితర నాయకులు తిరిగి సొంత గూటికి చేరనున్నారని జోరుగా ప్రచారం జరిగింది.
కాగా, తనకు మక్తల్ లేదా నారాయణపేట స్థానం నుంచి టికెట్ కేటాయించాలని డీకే అరుణ కాంగ్రెస్‌ను కోరుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాము పార్టీ మారడం లేదని బీజేపీలోనే కొనసాగుతామని ఇప్పటికే వివేక్, మర్రి శశిధర్ రెడ్డి ప్రకటించారు.
తాజాగా డీకే అరుణ కూడా పార్టీ మార్పుపై స్పందించారు. తాను కాంగ్రెస్‌లో చేరడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మైండ్ గేమ్ ఆడుతోందని, కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన నాయకులంతా తిరిగి సొంత గూటికి వస్తున్నారని ప్రచారం చేస్తోందని విమర్శించారు. తాను పార్టీ మారే ప్రసక్తి లేదని, కాంగ్రెస్‌లో చేరబోనని డీకే అరుణ చెప్పారు.
బీజేపీ అధిష్టానం తనకు ఎంతో గుర్తింపు ఇచ్చిందని, జాతీయ ఉపాధ్యక్ష పదవి అప్పగించిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేసేందుకు అదృష్టం ఉండాలని ఆమె అన్నారు.