Telugu Global
Telangana

అరగంట కరెంట్ తీసేసినందుకు డీఈ సస్పెండ్

కరెంటు కోతల విషయంలో ప్రతిపక్షాల విమర్శలను తట్టుకోలేక ప్రభుత్వం.. అధికారులపై ప్రతాపం చూపిస్తోందనే ఆరోపణలు కూడా వినపడుతున్నాయి.

అరగంట కరెంట్ తీసేసినందుకు డీఈ సస్పెండ్
X

తెలంగాణ రాజకీయాలను కరెంటు శాశిస్తోంది. కరెంటు సరఫరా విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా డివిజనల్ ఇంజినీర్ స్థాయి వ్యక్తులు కూడా సస్పెండ్ అవుతున్నారు. కరెంటు కోతల విషయంలో ప్రతిపక్షాల విమర్శలను తట్టుకోలేక ప్రభుత్వం ఇలా అధికారులపై ప్రతాపం చూపిస్తోందనే ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. తాజాగా డీఈ సస్పెన్షన్ తో అధికారుల్లో ఆందోళన మొదలైంది.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరెంటు కష్టాలు పెరిగాయని, సరఫరా సరిగా ఉండటం లేదని, గృహ అవసరాలకు, వ్యవసాయ సరఫరాకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ఆరోపణలున్నాయి. దీన్ని మొదటి నుండీ ఖండిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కొంతమంది అధికారులు బీఆర్ఎస్ కి అనుకూలంగా వ్యవహరిస్తూ కరెంట్ కట్ చేస్తూ సామాన్యులను ఇబ్బందులు పెడుతున్నారని ఆమధ్య సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కొందరు అధికారులు, సిబ్బంది వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇటీవల పవర్ కట్స్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా స్వయంగా ట్వీట్ వేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డి సమావేశంలో కరెంటు కట్ కావడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేసీఆర్ చెప్పింది అబద్ధం అంటూ సీఎం, డిప్యూటీ సీఎం వాదిస్తున్నా.. మల్లారెడ్డి వీడియో సాక్ష్యాన్ని మాత్రం ఎవరూ కాదనలేకపోతున్నారు. ఈ ఘటనపై ఇప్పుడు ఉన్నతాధికారులు ఆరా తీశారు. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు వేశారు.

డీఈ చేసిన తప్పేంటి..?

కరెంటు కష్టాలపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కొత్తగా లైన్ క్లియరెన్స్(ఎల్.సి.) విషయంలో నిబంధనలు మార్చారు. ఎల్.సి. తీసుకోవాలంటే కింది స్థాయి అధికారులు ముందుగా సర్కిల్ ఎస్ఈ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో కూడా ఈ అనుమతి తప్పనిసరి. కానీ శనివారం హైదరాబాద్‌లోని హబ్సిగూడ సర్కిల్‌ కీసర డివిజనల్‌ ఇంజినీర్‌ (డీఈ) ఎల్‌.భాస్కర్‌రావు అనుమతి తీసుకోకుండా ఎల్.సి. ఇచ్చారు. దీంతో ఆ రోజు ఉదయం 10.05 గంటల నుంచి 10.35 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఆ సమయంలో నాగారంలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఓ ఫంక్షన్ హాల్ లో ఎన్నికల ప్రచార సమావేశం నిర్వహిస్తున్నారు. ఆయన మాట్లాడుతుండగానే కరెంటు పోయింది. దీంతో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. కరెంటు కష్టాలు ఎలా ఉన్నాయో చూడండి అంటూ సెటైర్లు పేల్చారు. ఈ వ్యాఖ్యలు, కరెంటు పోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ముందస్తు అనుమతి లేకుండానే అరగటం కరెంట్ నిలిపివేశారని తేలడంతో డీఈపై సస్పెన్షన్ వేటు వేశారు.

First Published:  29 April 2024 2:54 AM GMT
Next Story