అప్పుల్లో కూరుకుపోయి.. భార్యాబిడ్డలను చంపి.. - కలెక్టర్ గన్‌మేన్ ఆత్మహత్య
ఉదయాన్నే పాఠశాలకు వెళ్లిన పిల్లలను వెంటనే వెళ్లి ఇంటికి తీసుకొచ్చేశాడు. భార్య చైతన్య (30), కుమారుడు రేవంత్ (6), కుమార్తె రిషిత (5)లను తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చి చంపేశాడు.
ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ.. కుటుంబాన్ని ఎలాంటి లోటూ లేకుండా చూసుకోవాల్సిన పరిస్థితుల్లో ఆన్‌లైన్ బెట్టింగ్‌కి అలవాటుపడిన అతను పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. ఆ అప్పులు తీర్చే దారి లేక.. భార్యాబిడ్డలను హతమార్చి.. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘోర విషాదం సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామునిపట్ల గ్రామంలో జరిగింది. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి కలెక్టర్ గన్‌మేన్ కావడం గమనార్హం. దీనికి సంబంధించి పోలీస్ కమిషనర్ శ్వేత శుక్రవారం విలేకరులకు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.
సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వద్ద గన్‌మేన్‌గా విధులు నిర్వహిస్తున్న ఆకుల నరేశ్ (35) గత కొంతకాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌కి అలవాటుపడ్డాడు. బెట్టింగ్‌లో డబ్బులు మొత్తం పోగొట్టుకోవడంతో పాటు అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఆ అప్పుల నుంచి ఎలా బయటపడాలో కూడా అతనికి అర్థం కాలేదు. ఈ నేపథ్యంలోనే ఈ విషయమై భార్యాభర్తల మధ్య శుక్రవారం ఉదయం గొడవ జరిగింది. అది తారస్థాయికి చేరడంతో ఆగ్రహానికి గురైన నరేశ్.. ఉదయాన్నే పాఠశాలకు వెళ్లిన పిల్లలను వెంటనే వెళ్లి ఇంటికి తీసుకొచ్చేశాడు. భార్య చైతన్య (30), కుమారుడు రేవంత్ (6), కుమార్తె రిషిత (5)లను తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చి చంపేశాడు. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.
నరేశ్‌కు అప్పులు ఉన్నట్టు ప్రాథమికంగా తెలిసిందని కమిషనర్ తెలిపారు. నరేశ్ ఆన్ డ్యూటీలో ఉండగానే ఈ ఘటన జరిగిందని వివరించారు. ఘటనా స్థలంలో ఉన్న నరేశ్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.