తెలంగాణలో బడులు తెరిచే రోజే.. విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ
మే నెలాఖరులోగా 100 శాతం పాఠ్య పుస్తకాలు జిల్లా కేంద్రాలకు చేరతాయని.. అక్కడి నుంచి వివిధ పాఠశాలలకు అందుతాయని అధికారులు చెబుతున్నారు.
తెలంగాణలోని ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి గాను, బడులు తెరిచే రోజు విద్యార్థులకు టెక్ట్స్ బుక్స్ అందించాలని నిర్ణయించారు. వేసవి సెలవుల అనంతరం జూన్ 12న రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు రీఓపెనింగ్ కానున్నాయి. అదే రోజు రాష్ట్రంలోని 28.77 లక్షల మంది విద్యార్థులకు 1.63 కోట్ల పుస్తకాలు ఉచితంగా అందజేయనున్నారు.
ఇప్పటికే 52.10 లక్షల పుస్తకాలను టీఎస్ఆర్టీసీ కార్గో ద్వారా జిల్లాలకు రవాణా చేశారు. మే నెలాఖరులోగా 100 శాతం పాఠ్య పుస్తకాలు జిల్లా కేంద్రాలకు చేరతాయని.. అక్కడి నుంచి వివిధ పాఠశాలలకు అందుతాయని అధికారులు చెబుతున్నారు. నిరుడు ఉక్రెయిన్ యుద్దం కారణంగా పేపర్ ముడిసరుకు లభించక పోవడం వల్ల పాఠ్య పుస్తకాల ముద్రణ ఆలస్యమైంది. కానీ, ఈ సారి అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో సకాలంలో టెక్ట్స్ బుక్స్ ముద్రణ జరిగింది.
ఇంగ్లీష్ మీడియం ఉన్నందున ఒకే పుస్తకాన్ని తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ముద్రించారు. ఇప్పుడు ఇదే పుస్తకాన్ని రెండు పార్ట్‌లుగా విభజించారు. 9వ తరగతి వరకు ద్విభాషా పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ముందుగా పార్ట్-1 పుస్తకాలు అందించి.. జూలై, అగస్టులో పార్ట్-2 పుస్తకాలు అందజేయనున్నారు. ఈ సారి పుస్తకాలను మరింత క్వాలిటీ పేపర్‌పై ముద్రించారు. దీంతో ఎక్కువ కాలం మన్నిక ఉంటాయి. గతంలో అక్షరాల సైజు కంటే ఈ ఏడాది ముద్రించిన పుస్తకాల్లో ఫాంట్ సైజ్ పెంచారు. దీని వల్ల పుస్తకాల వెడల్పు కాస్త పెరిగింది. అయితే పొడవు మాత్రం పాత సైజ్‌లోనే ఉన్నది.
రాష్ట్రంలో 28,77,675 మంది విద్యార్థులు ఉండగా.. 1,63,78,607 పుస్తకాలు అవసరం అవుతాయి. అయితే, గతేడాది నిల్వ 6,30,337 పుస్తకాలు ఉన్నాయి. దీంతో ఈ సారి 1,57,78,270 పుస్తకాలను ముద్రిస్తున్నారు. ఇప్పటి వరకు 52,10,226 పుస్తకాలు జిల్లాలకు చేరాయి. మరో 1,05,38,044 పుస్తకాలు రవాణా చేయాల్సి ఉన్నది.