Telugu Global
Telangana

కాంగ్రెస్ లో కమిటీల చిచ్చు: రంగంలోకి దిగిన దిగ్విజయ్ సింగ్... వెనక్కి తగ్గిన సీనియర్లు

కాంగ్రెస్ జాతీయ అధక్షుడు మల్లికార్జున్ ఖర్గే భట్టి విక్రమార్కకు ఫోన్ చేసి దిగ్విజయ్ సింగ్ వచ్చి సమస్యలను పరిష్కరిస్తాడని చెప్పినట్టు తెలుస్తోంది. అనంతర దిగ్విజయ్ సింగ్ కూడా భట్టి కి ఫోన్ చేసినట్టు సమాచారం.

కాంగ్రెస్ లో కమిటీల చిచ్చు: రంగంలోకి దిగిన దిగ్విజయ్ సింగ్... వెనక్కి తగ్గిన సీనియర్లు
X

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ రోజు జరగాల్సిన సీనియర్ల‌ సమావేశం రద్దయినట్టు సమాచారం. కొద్ది రోజుల క్రితం సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క ఇంట్లో సమావేశమైన కాంగ్రెస్ ఎంపీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహేశ్వర్ రెడ్డి, మధు యాస్కీ, దామోదర రాజనర్సింహ, కోదండ రెడ్డి తదితరులు రేవంత్ పై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత రేవంత్ వర్గం నేతలు తమ తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలువుగా చీలిపోయింది. దాంతో అప్రమత్తమైన కాంగ్రెస్ అధిష్టానం సమస్యను పరిష్కరించే బాధ్యతను సీనియర్ ఏఐసీసీ నాయకుడు దిగ్విజయ్ సింగ్ కు అప్పగించి‍ంది. వెంటనే రంగంలోకి దిగిన ఆయన మహేశ్వర్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడినట్టు సమాచారం. ఒకటి రెండు రోజు ల్లో తాను హైదరాబాద్ కు వస్తానని అప్పటి వరకు సమావేశాలు నిర్వహించడం కానీ, బహిరంగంగా మాట్లాడటం కానీ చేయవద్దని చెప్పినట్టు తెలిసింది.

మరో వైపు కాంగ్రెస్ జాతీయ అధక్షుడు మల్లికార్జున్ ఖర్గే భట్టి విక్రమార్కకు ఫోన్ చేసి దిగ్విజయ్ సింగ్ వచ్చి సమస్యలను పరిష్కరిస్తాడని చెప్పినట్టు తెలుస్తోంది. అనంతర దిగ్విజయ్ సింగ్ కూడా భట్టి కి ఫోన్ చేసినట్టు సమాచారం.

మల్లికార్జున్ ఖర్గే భట్టి విక్రమార్కకు ఫోన్ చేయడం, దిగ్విజయ్ సింగ్ భట్టికి, మహేశ్వర్ రెడ్డిలకు ఫోన్ చేసి మాట్లాడటంతో సీనియర్లు ఈ రోజు జరగాల్సిన సమావేశాన్ని రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం మరొకసారి భేటీ అవ్వాలని అసమ్మతి నేతలు మొన్ననే నిర్ణయం తీసుకున్నారు. అయితే అధిష్టానం ఆదేశాలతో సమావేశం రద్దు చేసుకున్న సీనియర్లు దిగ్విజయ్ సింగ్ కు రేవంత్ రెడ్డిపై పిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. పార్టీ కోసం పనిచేసిన వారికి అవకాశాలు కల్పించాలన్నదే తమ డిమాండ్ అని దిగ్విజయ్ కి చెప్పినట్టు సమాచారం.

మరి దిగ్విజయ్ సింగ్ వచ్చి సమస్యను పరిష్కరిస్తారా ? రెండు వర్గాలను దిగ్విజయ్ ఏకం చేయగల్గుతారా ? అందరూ కలిసి పార్టీ కోసం పని చేస్తారా? ఇవన్నీ సగటు కాంగ్రెస్ కార్యకర్తల్లో మెదులుతున్న ప్రశ్న‌లు.

First Published:  20 Dec 2022 2:28 PM IST
Next Story