Telugu Global
Telangana

అధ్యక్ష పదవిపై టీ.బీజేపీలో లొల్లి

తాజాగా బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. సీనియర్లతో చర్చించిన తర్వాతే రాష్ట్ర అధ్యక్ష పదవి నిర్ణయం తీసుకోవాలన్నారు.

అధ్యక్ష పదవిపై టీ.బీజేపీలో లొల్లి
X

సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇదే విషయం పార్టీ నేతల మధ్య విబేధాలకు దారి తీసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్‌ నుంచి గెలిచి మరోసారి మోడీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. దీంతో పార్టీ అధ్యక్షుడిగా కొత్త నేతను ఎంపిక చేసేందుకు హైకమాండ్ ప్రయత్నాలు మొదలెట్టింది.

ఈటల రాజేందర్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కేంద్ర కేబినెట్ ప్రమాణస్వీకారం రోజే ఈ ప్రకటన ఉంటుందని భావించారు. కానీ, ఇప్పటివరకూ అధ్యక్ష పదవిపై హైకమాండ్‌ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈటల రాజేందర్‌ అభ్యర్థిత్వంపై పార్టీలోని సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. తాజాగా బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. సీనియర్లతో చర్చించిన తర్వాతే రాష్ట్ర అధ్యక్ష పదవి నిర్ణయం తీసుకోవాలన్నారు రాజాసింగ్‌. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల అభిప్రాయం తీసుకోవాలన్నారు. దేశం, ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తికే అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు ఈటల రాజేందర్ సైతం హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలో కొత్త, పాత నాయకులలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఏ పార్టీ అయినా కొత్త నాయకత్వం, కొత్త కార్యకర్తలు వస్తేనే సంపూర్ణ విజయం సాధిస్తుందన్నారు. పార్టీ అంటే కేవలం ఎంపీలను, ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం కాదన్నారు ఈటల. మొత్తానికి టీ.బీజేపీలో అధ్యక్ష పదవి విషయంలో వివాదం ముదిరినట్లే కనిపిస్తోంది.

First Published:  21 Jun 2024 3:48 PM GMT
Next Story