Telugu Global
Telangana

కేసీఆర్ బహిరంగ సభ వేళ.. టీఆర్ఎస్‌ను భయపెడుతున్న అసంతృప్త నేతలు

నియోజకవర్గంలోని కొంత మంది టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నేతలు మొదటి నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై వ్యతిరేకత చూపిస్తున్నారు. ఇప్పుడు వీరందరినీ సమన్వయం చేయడం టీఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది.

కేసీఆర్ బహిరంగ సభ వేళ.. టీఆర్ఎస్‌ను భయపెడుతున్న అసంతృప్త నేతలు
X

ఏ పార్టీలో అయినా అసంతృప్త నేతలు ఉండటం సాధారణమే. కానీ కీలకమైన సమయంలో వీళ్ల డిమాండ్లు ఆయా పార్టీలకు తలనొప్పులు తెస్తుంటాయి. ఇప్పుడు మునుగోడు బైపోల్ సమయంలో టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్త నేతలు ఇబ్బందికరంగా మారారు. మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ పార్టీ.. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పలు సమీక్షలు నిర్వహిస్తూ నేతలు, కార్యకర్తలను అప్రమత్తం చేస్తోంది. శనివారం (20న) సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉండటంతో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది.

టీఆర్ఎస్ తరపున ఎవరు బరిలో ఉంటారనే విషయాన్ని రేపు కేసీఆర్ స్వయంగా ప్రకటించనున్నారు. కానీ, అంతకు ముందే మునుగోడుకు సంబంధించి పలువురు ముఖ్య నేతలను ప్రగతి భవన్ పిలిపించుకొని కేసీఆర్ చర్చలు జరిపారు. మునుగోడు బహిరంగ సభ ఏర్పాట్లను నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఆయన సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డిలకు కేసీఆర్ అప్పగించారు. అప్పటి నుంచి ఇద్దరూ నియోజకవర్గంలోని నాయకులతో సమన్వయం చేసుకుంటూ, బహిరంగ సభ విజయవంతానికి కృషి చేస్తున్నారు.

ఏ ఎన్నికలో అయినా గెలవడానికి ఎంత మంది సీనియర్లను ఇంచార్జులుగా నియమించినా.. ద్వితీయ శ్రేణి నాయకుల మద్దతు లేకపోతే విజయం సాధించడం కష్టం. అందుకే కీలకమైన సమయాల్లో ఈ నాయకుల డిమాండ్లను తీర్చడానికి నానా కష్టాలు పడాల్సి వస్తుంది. ఇప్పుడు మునుగోడులో కూడా అదే పరిస్థితి ఎదురవుతున్నది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓడిపోయి కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచారు. ఆయనకు నియోజకవర్గంలోని ప్రతీ మండలంలో అనుచరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా టీఆర్ఎస్‌కు చెందిన కొంత మంది ముఖ్య నాయకులతోనూ ఆయన సత్సంబంధాలు కొనసాగించారు.

టీఆర్ఎస్‌కు చెందిన ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పలువురు రాజగోపాల్ రెడ్డికి సహకరించారు. ఇప్పుడు ఉపఎన్నికలో ఆయన బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. అయినా సరే తన పాత పరిచయాలతో వారి మద్దతు కోరినట్లు తెలుస్తున్నది. అదే సమయంలో నియోజకవర్గంలోని కొంత మంది టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నేతలు మొదటి నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై వ్యతిరేకత చూపిస్తున్నారు. ఇప్పుడు వీరందరినీ సమన్వయం చేయడం టీఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇతర పార్టీల నాయకుల ప్రలోభాలకు కొంత మంది నాయకులు లొంగిపోతుండటంపై అధిష్టానం సీరియస్‌గా ఉన్నది.

రాష్ట్రంలో అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నా.. మునుగోడు టీఆర్ఎస్ నాయకుల తీరు మాత్రం ప్రతిపక్షాన్ని తలపిస్తోందని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇక కీలకమైన బైపోల్ సమయంలో అలాంటి నాయకుల డిమాండ్లు ఆకాశాన్ని అంటుతున్నాయని వాపోతున్నారు. రేపు అభ్యర్థి ఎవరైనా సరే.. వీరి డిమాండ్లకు భయపడాల్సిన పరిస్థితి నెలకొన్నది. కేసీఆర్ సభకు భారీగా జన సమీకరణ చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన కీలక నాయకులకు ఈ మేరకు బాధ్యతలు అప్పగించారు. అయితే వీరిలో కొంత మంది అసంతృప్త నేతలు జనసమీకరణపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

బహిరంగ సభ బాధ్యులుగా ఉన్న కంచర్ల బ్రదర్స్‌కు ఈ నేతలతో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సమాచారం. ముందు బహిరంగ సభ, ఉపఎన్నిక కానివ్వండి.. తర్వాత అధిష్టానంతో మాట్లాడి తమ డిమాండ్లు తీరుస్తామని బుజ్జగిస్తున్నారు. అయితే ఉప ఎన్నికకు ముందే తమకు స్పష్టమైన హామీ లభించాలని.. పథకాలు, పనుల్లో తమ వాటా తమకు ఇవ్వాలని కోరతున్నారట. ముందైతే రేపటి సభకు జనాలను తరలించడానికి సహకరించమని కంచర్ల బ్రదర్స్ కోరినట్లు సమాచారం. దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఆ నాయకులు ఇలా తమ డిమాండ్లను నెరవేర్చుకోవడానికి ప్లాన్ వేశారని పార్టీ నాయకులు అంటున్నారు. ఏదేమైనా కీలక సమయంలో అసంతృప్త నేతల తీరు పార్టీలో చర్చనీయాంశం అయ్యింది.

First Published:  19 Aug 2022 10:47 AM IST
Next Story