మినీ అంగన్‌వాడీలపై వివక్ష సరికాదు
అంగన్‌వాడీ టీచర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలి : కేటీఆర్
మినీ అంగన్‌వాడీలపై ప్రభుత్వం వివక్ష చూపడం సరికాదని, అంగన్‌వాడీ టీచర్లతో వారికి సమాన వేతనాలు ఇవ్వాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ భవన్ లో మినీ అంగన్‌వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను మినీ అంగన్‌వాడీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆడెపు వరలక్ష్మీ, సంఘం నాయకులు కేటీఆర్ కు వివరించారు. రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్‌వాడీలను ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించినా ఆ ప్రక్రియ పూర్తి చేయలేదని సంఘం ప్రతినిధులు వివరించారు. జనవరి నుంచి అంగన్‌వాడీ టీచర్లతో సమానంగా మినీ అంగన్‌వాడీలకు నెలకు రూ.13,650 చొప్పున వేతనం ఇవ్వడం ప్రారంభించి, మార్చి నెలలో పాత వేతనం రూ.7,800లు మాత్రమే ఇచ్చారని.. అప్పటి నుంచి పాత వేతనమే చెల్లిస్తున్నారని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లకు తోడుగా హెల్పర్ ఉంటారని, మినీ అంగన్‌వాడీలే అన్ని పనులు చేయాల్సి వస్తుందని తెలిపారు. కేంద్రాల నిర్వహణతో పాటు ఓటరు నమోదు, సర్వేలు, పల్స్ పోలియో లాంటి అదనపు పనిభారం మోస్తున్నామని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాలకు ఇవ్వాల్సిన అద్దె, కూరగాయలు, ఇతర బకాయిలు నెలల తరబడి పెండింగ్‌లో పెట్టారని తెలిపారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో అంగన్‌వాడీల సమస్యలను లేవనెత్తుతామని, ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరులు పాల్గొన్నారు.