లెఫ్ట్ పార్టీలతో పొత్తు.. కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు..!
కమ్యూనిస్టులతో పొత్తు విషయంలో కాంగ్రెస్‌లో భిన్నభిప్రాయాలున్నాయని ప్రచారం జరుగుతోంది. లెఫ్ట్ పార్టీలతో పొత్తులు కుదుర్చుకోవడం పలువురు నేతలకు అంతగా ఇష్టం లేదనే వాదన వినిపిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార BRSతో పాటు కాంగ్రెస్ నువ్వా, నేనా అన్నట్లుగా వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్‌తో పొత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కమ్యూనిస్టులకు షాకిచ్చారు కేసీఆర్. దీంతో ఇప్పుడు కమ్యూనిస్టులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అటు కాంగ్రెస్ సైతం కామ్రేడ్లను కలుపుకుని వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే సీపీఐ, సీపీఎం పార్టీల అగ్రనేతలకు ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం.
ఇక ఆదివారం కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. తాము పోటీ చేసే స్థానాలను ఆయన కాంగ్రెస్ దృష్టికి తీసుకెళ్లారు. బెల్లంపల్లి, కొత్తగూడెం హుస్నాబాద్, మునుగోడు స్థానాలు కోరారు . ఇందులో ఏవైనా మూడు నియోజకవర్గాలు కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు సిద్ధమని చెప్పినట్టు సమాచారం.
అయితే కమ్యూనిస్టులతో పొత్తు విషయంలో కాంగ్రెస్‌లో భిన్నభిప్రాయాలున్నాయని ప్రచారం జరుగుతోంది. లెఫ్ట్ పార్టీలతో పొత్తులు కుదుర్చుకోవడం పలువురు నేతలకు అంతగా ఇష్టం లేదనే వాదన వినిపిస్తోంది. ప్రధానంగా నల్గొండ, ఖమ్మం జిల్లా నేతలు ఒంటరిగా పోటీ చేయడమే మేలని భావిస్తున్నారట. ఇందుకు ప్రధాన కారణం పొత్తులో పోటీకి వెళ్తే.. తమ సీట్లను ఆ పార్టీలకు వదులుకోవాల్సి వస్తుందనే భావన ఉండటమే. మొత్తం నాలుగు జిల్లాల్లో ఏడు స్థానాలను అడుగుతున్నారు లెఫ్ట్ పార్టీల నేతలు. అయితే కాంగ్రెస్‌లో ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు పలువురు నేతలు దరఖాస్తు చేసుకున్నారు. లెఫ్ట్ పార్టీలు అడుగుతున్న సీట్లలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, పాలేరుతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మునుగోడు, దేవరకొండ, మిర్యాలగూడ సీట్లు ఉన్నాయి.
హుస్నాబాద్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దరఖాస్తు చేసుకోగా.. బెల్లంపల్లి నుంచి కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి కుమారుడు గడ్డం వినోద్ కుమార్ దరఖాస్తు చేసుకున్నారు. ఇక కొత్తగూడెం నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మునుగోడు నుంచి చలమల కృష్ణా రెడ్డి, కైలాస్ నేత పోటీలో ఉన్నారు. దేవరకొండ టికెట్ కోసం రమేష్ నాయక్, బాలు నాయక్, కిషన్ నాయక్ దరఖాస్తు చేసుకున్నారు. ఇక మిర్యాలగూడ టికెట్ కోసం జానారెడ్డి కుమారుడు జయవీర్ రెడ్డి అర్జీ పెట్టుకున్నారు. పాలేరు స్థానం నుంచి రాయల నాగేశ్వర రావు టికెట్ ఆశిస్తున్నారు.
*