Telugu Global
Telangana

కేంద్ర వైఖరితో 'బీహెచ్' సిరీస్‌పై సందిగ్దం.. దక్షిణాదిలో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు 'సున్నా'

బీహెచ్ సిరీస్‌ రిజిస్ట్రేషన్లలో మహారాష్ట్ర 13,625తో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ (5,693), రాజస్థాన్ (5,615) ఉన్నాయి.

కేంద్ర వైఖరితో బీహెచ్ సిరీస్‌పై సందిగ్దం.. దక్షిణాదిలో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు సున్నా
X

కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన బీహెచ్ (భారత్ సిరీస్) రిజిష్ట్రేషన్లకు దక్షిణాది రాష్ట్రాల్లో సందిగ్దత నెలకొన్నది. తరచూ వేర్వేరు రాష్ట్రాలకు బదిలీ అయ్యే కేంద్ర ప్రభుత్వ, డిఫెన్స్ ఉద్యోగులతో పాటు నాలుగు అంత కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఆఫీసులు ఉన్న ప్రైవేటు సంస్థలకు చెందిన ఉద్యోగులు ఈ బీహెచ్ సిరీస్‌తో తమ వాహనాలు (కార్లు) రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. 2021 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. బీహెచ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి ఈ ఏడాది డిసెంబర్ తొలి వారం వరకు దేశవ్యాప్తంగా 49,696 వాహనాలు మాత్రమే ఆ సిరీస్‌తో రిజిస్ట్రేషన్ అయ్యాయి.

బీహెచ్ సిరీస్‌ రిజిస్ట్రేషన్లలో మహారాష్ట్ర 13,625తో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ (5,693), రాజస్థాన్ (5,615) ఉన్నాయి. కర్నాటక మినహా దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా కాకపోవడం గమనార్హం. భారత్ సిరీస్ రిజిస్ట్రేషన్ చేయించాలంటే అందుకు అర్హులైన ఉద్యోగులు వాహనం కొనే సమయంలోనే డీలర్‌కు తగిన డాక్యుమెంట్లు అందించాలి. సాధారణంగా స్టేట్ రిజిస్ట్రేషన్ అయితే కారు కొన్నప్పుడే 15 ఏళ్లకు లైఫ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే బీహెచ్ సిరీస్‌కి మాత్రం రెండేళ్ల కాలానికి ట్యాక్స్ చెల్లిస్తే సరిపోతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో లైఫ్ ట్యాక్స్ రూ.5 లక్షల లోపు వాటికి 3 శాతం, రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య ఉన్న వాటికి 14 శాతం, రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలు ఉన్న వాటికి 17 శాతం, రూ. 20 లక్షల కంటే ఎక్కువగా ఉంటే 18శాతం చెల్లించాలి. డీజిల్ వాహనం అయితే 2 శాతం ఎక్కువగా, ఎలక్ట్రిక్ కారు అయితే 2 శాతం తక్కువగా పన్ను ఉంటుంది.

అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన లైఫ్ ట్యాక్స్ మాత్రం రూ. 10 లక్షల లోపు 8 శాతం, రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు 10 శాతం, రూ. 20 లక్షల పైన వాటికి 12 శాతం చెల్లిస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా డీజిల్ వాహనాలకు 2 శాతం అదనం, ఎలక్ట్రిక్ వాహనాలకు 2 శాతం తక్కువ పన్ను విధిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ట్యాక్సులు చాలా తక్కువగా ఉన్నాయని, పైగా కేవలం రెండేళ్లకే చెల్లింపులు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం భారీగా పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అసలు రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండా ఏక పక్షంగా నిర్ణయం తీసుకోవడం వల్ల తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు బీహెచ్ సిరీస్ రిజిస్ట్రేషన్లు చేయడం లేదు.

సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్ 1989 ప్రకారం కొత్త రిజిస్ట్రేషన్ సిస్టమ్‌ను అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలపైనే ఉన్నదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా నష్టపోతుండటంతో ఆ మేరకు వాహనాల రిజిస్ట్రేషన్లను దక్షిణాది రాష్ట్రాలు చేయడం లేదు. పైగా కేవలం రెండేళ్ల ట్యాక్సే కట్టించుకోవాలనే నిబంధన కారణంగా ఆదాయం భారీగా తగ్గిపోయే అవకాశం ఉందని రాష్ట్రాలు వాదిస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు దక్షిణాదిలో బీహెచ్ సిరీస్ రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు రవాణా శాఖ అధికారులు తెలియజేస్తున్నారు.

First Published:  20 Dec 2022 6:24 AM IST
Next Story