Telugu Global
Telangana

తెలంగాణ గ్రామాల్లో 'బలగం' ప్రదర్శన.. అక్రమ పంపిణీ అడ్డుకోవాలని దిల్ రాజు ప్రొడక్షన్స్ ఫిర్యాదు

ఈ సినిమాను తెలంగాణ గ్రామాల్లో ప్రదర్శిస్తున్నందు వల్లే దిల్ రాజు ప్రొడక్షన్స్ సినిమా పైరసీపై కంప్లైంట్ చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో చర్చించుకుంటున్నారు.

తెలంగాణ గ్రామాల్లో బలగం ప్రదర్శన.. అక్రమ పంపిణీ అడ్డుకోవాలని దిల్ రాజు ప్రొడక్షన్స్ ఫిర్యాదు
X

ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూతురు, కొడుకు కలిసి నిర్మించిన తొలి చిత్రం 'బలగం'. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వేణు యెల్దండి దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్యా జంటగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. తెలంగాణ ప్రాంత గ్రామీణ వాతావరణాన్ని, ఇక్కడి మనుషుల జీవితాలను, ఆచారాలను, కోపాలను, పట్టువిడుపులను అత్యంత సహజంగా చూపించారు. అయితే, ఈ సినిమా థియేటర్‌లో విడుదలైన 20 రోజుల తర్వాత అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ ప్రారంభించారు. కాగా, ఈ సినిమాకు లభిస్తున్న ఆదరణతో తెలంగాణలోని చాలా గ్రామాల్లో ప్రైవేట్ షోలు వేస్తున్నారు. తమ ఊరి వారికి చూపించాలని భావించిన కొంత మంది.. స్క్రీన్ ఏర్పాటు చేసి, ప్రొజెక్టర్ సాయంతో సినిమాను ప్రదర్శిస్తున్నారు. కాగా, ఈ విషయంపై దిల్ రాజు ప్రొడక్షన్స్ నిజామాబాద్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

'మా బలగం సినిమా 2023 మార్చి 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశాము. తెలంగాణ సమాజంలోని ఆచారాలను, సాంప్రదాయాలను ఈ చిత్రంలో చూపించడంతో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ లభించింది. కాగా, ఈ సినిమాకు చెందిన డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్‌కు ఇచ్చాము. దీంతో వాళ్లు మార్చి 24 నుంచి వారి ప్లాట్‌ఫామ్‌పై స్ట్రీమింగ్ చేస్తున్నారు' అని లేఖలో పేర్కొన్నారు.

'కాగా, ఈ సినిమాను కొంత మంది యాంటీ సోషల్ గ్రూప్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి డౌన్‌లోడ్ చేసి ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. దీని వల్ల మా థియేటర్ కలెక్షన్లకు భారీగా నష్టం ఏర్పడుతోంది. కాబట్టి అలా పంపిణీ చేస్తున్న గ్రూప్‌పై చర్యలు తీసుకోవాలి. ఈ పైరసీ యాక్టివిటీ వల్ల మా సినిమా రెవెన్యూకు చాలా నష్టం వస్తోంది.' అని దిల్ రాజు ప్రొడక్షన్స్ తరపున మేనేజర్ ఫిర్యాదు చేశారు.

ఇక నిజామాబాద్ జిల్లాలోని గ్రామాల్లో సినిమాను ప్రదర్శిస్తున్నారని.. ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా ప్రదర్శిస్తున్నారంటే ఎస్వీసీ థియేటర్ మేనేజర్ దాసరి నాగేశ్వరరావు కామారెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఊర్లలో సర్పంచ్‌ల అనుమతి తీసుకొని సినిమాను బహిరంగంగా వేస్తున్నారంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ సినిమాను తెలంగాణ గ్రామాల్లో ప్రదర్శిస్తున్నందు వల్లే దిల్ రాజు ప్రొడక్షన్స్ కూడా సినిమా పైరసీ పేరుతో కంప్లైంట్ చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో చర్చించుకుంటున్నారు. ఊర్లలో స్క్రీన్‌పై సినిమా చూసే వాళ్లపై కేసులు పెట్టే వీలు లేనందునే.. ఆ వీడియోను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వారిపై కేసు పెట్టారని అంటున్నారు. అయితే, బలగం సినిమా థియేటర్, ఓటీటీలో హిట్ అవడమే కాకుండా.. ఇప్పుడు గ్రామ గ్రామాన ప్రదర్శిస్తుండటం గమనార్హం. స్థానిక యువకులే చొరవ తీసుకొని ప్రతీ రోజు ఏదో ఒక ఊరిలో బలగం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తున్నది.







First Published:  2 April 2023 12:12 PM GMT
Next Story