కాంగ్రెస్ నాయకులకు దిగ్విజయ్ హెచ్చరికలు...అంత సీన్ ఉందా అంటూ కార్యకర్తల్లో చర్చ
ఎంత పెద్ద నాయకులైనా క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. ''పార్టీలో సీనియర్ నేతలు సమన్వయంతో నడవాలి. ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకోవద్దు.'' అని దిగ్విజయ్ అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్లు వర్సెస్ రేవంత్ రెడ్డి వర్గంగా సాగుతున్న రాజకీయాలను ఒక కొలిక్కి తేవడానికి, వీరి మధ్యలో రేగిన చిచ్చును చల్లార్చడానికి ఏఐసీసీ తరపున సీనియర్ నాయకడు దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగారు. నిన్న గాంధీ భవన్ లో దాదాపు 10 గంటల పాటు ఇరు వర్గాల నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఒకవైపు ఆయన అభిప్రాయ సేకరణ చేస్తుండగానే గాంధీ భవన్ లో ఇరువర్గాలు గల్లాలు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన దిగ్విజయ్ సింగ్ ఎంత పెద్ద నాయకులైనా క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
''పార్టీలో సీనియర్ నేతలు సమన్వయంతో నడవాలి. ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకోవద్దు. ఇప్పటికే రేవంత్ రెడ్డి నన్ను కలిశారు. చిన్న వయసు ఉన్నవారికి పీసీసీ అధ్యక్షపదవి ఇస్తే తప్పేంటి ? కొత్తవారికి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి'' అని దిగ్విజయ్ అన్నారు.
బీజేపీ, బీఆరెస్ లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు కలిసికట్టుగా పోరాడాల్సిన సమయంలో ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకొవడం సరైంది కాదని ఆయన హితవు పలికారు.
దిగ్విజయ్ సింగ్ మాట్లాడిన మాటలపై ఆ పార్టీ నేతల్లో, కార్యకర్తల్లోనే చర్చనడుస్తోంది. ఎంత పెద్ద నాయకులైనా క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చేసిన హెచ్చరికల పట్ల ఆ పార్టీ కార్యకర్తలు నవ్వుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితిలో నాయకుల పై చర్యలు తీసుకునే సత్తా అసలు కాంగ్రెస్ అధిష్టానానికి ఉందా ? అని వారు ప్రశ్నిస్తున్నారు.
మునుగోడు ఎన్నికల్లో స్వంత పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డిపై చర్య తీసుకునే ధైర్యం చేయని వారు ఇక మిగతా వారిని హెచ్చరిస్తే ఏం ఉపయోగం అని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
దేశవ్యాప్తంగా బలహీనమై ఉనికి కోసం కొట్టుమిట్టాడుతూ, బలహీనమైన జాతీయ నాయకత్వంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో నేతల మధ్య జరుగుతున్న రచ్చను ఆపగలదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.