Telugu Global
Telangana

ఖమ్మం కాంగ్రెస్‌లో విభేదాలు.. అధిష్టానంపై పొంగులేటి వర్గం అసంతృప్తి?

'తెలంగాణ జన గర్జన' సభ విషయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గం.. కాంగ్రెస్ నాయకుల తీరుపై బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఖమ్మం కాంగ్రెస్‌లో విభేదాలు.. అధిష్టానంపై పొంగులేటి వర్గం అసంతృప్తి?
X

ఖమ్మం కాంగ్రెస్‌లో మళ్లీ విభేదాలు మొదలయ్యాయి. నిన్నటి వరకు రేణుక చౌదరి, భట్టి వర్గంగా కాంగ్రెస్ రాజకీయాలు సాగాయి. ఇప్పుడు తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గం కూడా తయారయ్యింది. పొంగులేటి ఇంకా అధికారికంగా పార్టీలో చేరకముందే.. అతడి వర్గం అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఖమ్మంలో నిర్వహించనున్న 'తెలంగాణ జన గర్జన' సభ విషయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గం.. కాంగ్రెస్ నాయకుల తీరుపై బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇటీవల ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీని కలిసిన తర్వాత.. పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన సభకు మించి.. ఖమ్మంలో సభ ఏర్పాటు చేస్తానని పొంగులేటి ప్రకటించారు. రాహుల్ గాంధీ కూడా ఖమ్మం సభకు వస్తానని మాట ఇచ్చినట్లు పొంగులేటి చెప్పారు. 5 లక్షల మంది సభలో పాల్గొంటారని పొంగులేటి ప్రకటించారు. అయితే రెండు రోజుల్లోనే సభ విషయంలో భట్టి, పొంగులేటి వర్గాల మధ్య విభేదాలు వచ్చాయి.

సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్గ సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్నారు. అదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు 1,300 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర జరిగింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోకి అడుగుపెట్టారు. జూలై 2న భట్టి పాదయాత్ర ముగింపు జరుగనున్నది. ఈ సందర్భంగా భారీ సభ నిర్వహించాలని భావించారు. పొంగులేటి సభతో కాకుండా.. భట్టి పాదయాత్ర సభ వేరుగా నిర్వహించాలని అనుకున్నారు. అయితే, రాహుల్ గాంధీ.. ఒకే జిల్లాలో రెండు భారీ సభలు తక్కువ సమయంలో నిర్వహించడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పారు. భట్టి ముగింపు సభలోనే పొంగులేటిని చేర్చుకుందామని రాష్ట్ర నాయకులకు సూచించారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరే సభను ఘనంగా నిర్వహించడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే కూడా సభా ఏర్పాట్లను పరిశీలించారు. కాగా, ఇప్పుడు దీన్ని భట్టి పాదయాత్ర ముగింపు సభగా మార్చడాన్ని పొంగులేటి వర్గం జీర్ణించుకోలేక పోతున్నది. రెండు రోజుల్లోనే కాంగ్రెస్ అధిష్టానం ఇలా మాట మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సభకు అయ్యే ఖర్చు, జనసమీకరణ తాము చేస్తుంటే.. అక్కడ భట్టికి సన్మానం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

బుధవారం ఇదే విషయంలో ఇరు వర్గాల నడుమ మాటల యుద్దం కూడా నడిచింది. అయితే, పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే వారిని సముదాయించినట్లు సమాచారం. ఇది ఎవరో ఏర్పాటు చేసే సభగా చూడవద్దని.. కాంగ్రెస్ పార్టీ సభగానే చూడాలని వారిని కోరినట్లు తెలుస్తున్నది. ఆ తర్వాత ఠాక్రే, పొంగులేటి కలిసి భట్టి విక్రమార్క దగ్గరకు వెళ్లారు. అక్కడే పొంగులేటి.. భట్టిని సన్మానించారు. అయితే, రెండు రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలో వ్యవహారాలు ఎలా ఉంటాయో తెలిసి వచ్చాయని.. కానీ, తనకు ఇచ్చిన మాట అధిష్టానం నిలుపుకుంటుందనే ఇప్పటికీ ధీమాగా ఉన్నారని సన్నిహితులు తెలిపారు.

First Published:  29 Jun 2023 9:26 AM IST
Next Story