జిట్టా వర్సెస్ కుంభం అనిల్.. భువనగిరి కాంగ్రెస్‌లో విభేదాలు
కుంభం అనిల్ కుమార్ కేసీఆర్ కోవర్టులా కాంగ్రెస్‌లో చేరారంటూ జిట్టా అభిమానులు కాంగ్రెస్ సోషల్‌మీడియా వాట్సాప్ గ్రూపులో పోస్టులు పెడుతున్నారు.
పార్టీలో చేరికలు కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. వర్గాలుగా విడిపోయిన నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. భువనగిరి కాంగ్రెస్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ రెండు వర్గాలుగా విడిపోయింది. జిట్టా బాలకృష్ణా రెడ్డి వర్సెస్ కుంభం అనిల్ కుమార్ రెడ్డిగా పరిస్థితి మారింది. ఇద్దరు నేతల అభిమానులు సోషల్‌మీడియా వేదికగా సవాళ్లు విసురుకుంటున్నారు.
కుంభం అనిల్ కుమార్ కేసీఆర్ కోవర్టులా కాంగ్రెస్‌లో చేరారంటూ జిట్టా అభిమానులు కాంగ్రెస్ సోషల్‌మీడియా వాట్సాప్ గ్రూపులో పోస్టులు పెడుతున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఎవరికి వచ్చినా గెలిచిన తర్వాత పార్టీ మారబోమంటూ ఎల్లమ్మ గుడి ముందు ప్రమాణం చేయాలంటూ సవాల్ విసురుతున్నారు. దీనికి కుంభం అనిల్ కుమార్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. దేనికైనా రెడీ అంటున్నారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో విబేధాల కారణంగా కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరిన కుంభం అనిల్.. కొన్ని రోజులకే తిరిగి మళ్లీ హస్తం పార్టీ గూటికి చేరారు. ఇక ఈ గ్యాప్‌లోనే బీజేపీని వీడిన జిట్టా బాలకృష్ణా రెడ్డి.. కోమటిరెడ్డి సహకారంతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయిన భువనగిరి కాంగ్రెస్ కార్యకర్తలు.. సోషల్‌మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.