Telugu Global
Telangana

హస్తిన వేదికగా టీ-కాంగ్రెస్‌ కుస్తీ

పార్టీ మారుతున్నట్టు లేని పోని కథనాలు సృష్టిస్తున్నారని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన విషయంలో పార్టీ వార్ రూమ్ నుంచే తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు.

హస్తిన వేదికగా టీ-కాంగ్రెస్‌ కుస్తీ
X

హస్తిన వేదికగా టీ-కాంగ్రెస్‌లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. జూపల్లి, పొంగులేటి చేరికల నేపథ్యంలో టీ-కాంగ్రెస్‌ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌, పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిపై అసహనాన్ని వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. బిగ్‌ టీవీ ప్రతినిధిపై ఆగ్రహించారు. రేవంత్‌ మాటలు విని బిగ్‌టీవీలో తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ సీరియస్ అయ్యారు. ఛానల్‌ యాజమాన్యం తీరు మార్చుకోవాలని వార్నింగ్‌ ఇచ్చారు.

పార్టీ మారుతున్నట్టు లేని పోని కథనాలు సృష్టిస్తున్నారని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన విషయంలో పార్టీ వార్ రూమ్ నుంచే తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. వీటన్నింటి వెనక రేవంత్‌ రెడ్డి ఉన్నారని ఆయన బలంగా నమ్ముతున్నారు. అందుకే.. ఈ విషయాన్ని పార్టీ స్ట్రార్ట‌జీ కమిటీ సమావేశంలో తేల్చుకుంటాన‌న్నారు. రాహుల్‌ సమక్షంలో జరిగే సమావేశంలో అన్ని విషయాలు మాట్లాడుతానన్నారు. ఉత్తమ్‌ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్‌ పార్టీలో ఎందరు బలమైన నాయకులు చేరినా అంతర్గత విభేదాలను తొలగించడం కష్టమనే వాదన వినిపిస్తోంది.

కర్నాటక ఫలితాల తరువాత కాంగ్రెస్‌లో జోష్‌ పెరిగింది. తెలంగాణలోనూ అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది. అందుకోసం వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్త పడాలనే వ్యూహంతో చేరికలను ప్రోత్సహిస్తోంది. కాగా.. పొంగులేటి, జూపల్లి చేరికల పట్ల నల్లగొండ కాంగ్రెస్‌ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. కాంగ్రెస్‌ దూకుడుకు కళ్లెం వేసేందుకు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి బీఆర్‌ఎస్‌ గాలం వేసిందనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం వెనక రేవంత్‌ ఉన్నాడనేది ఉత్తమ్‌ ఆరోపణ.

నిజానికి రేవంత్‌ రెడ్డి పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచీ నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్‌ నేతల నుంచి ఏదో ఒక రూపంలో వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి సైతం పలుమార్లు రేవంత్‌ కారణంగా పార్టీ నష్టపోతోందని మాట్లాడారు. ఇక రేవంత్ సూచనలతోనే కాంగ్రెస్‌ వార్ రూమ్‌ తనను టార్గెట్‌ చేసిందని ఉత్తమ్‌ ఆరోపించారు. ఈ విషయంలో ఉత్తమ్‌ పోలీసులను కూడా ఆశ్రయించారు. ఉత్తమ్‌ ఫిర్యాదుతో కాంగ్రెస్ వార్‌రూమ్‌లో సోదాలు జరిపిన పోలీసులు.. కంప్యూటర్లు, లాప్‌ట్యాప్స్ స్వాధీనం చేసుకున్నారు. తాజాగా రేవంత్‌పై ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చేసిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ అంతర్గత విభేదాలను పరిష్కరించుకుంటే తప్ప కాంగ్రెస్‌ను ప్ర‌జ‌లు నమ్మరంటున్నారు విశ్లేషకులు. మరి అధిష్టానం ఈ పంచాయితీకి ఎలా పుల్‌స్టాప్‌ పెడుతుందో చూడాలి.

First Published:  27 Jun 2023 6:12 AM GMT
Next Story