Telugu Global
Telangana

డైట్‌ చార్జీలు పెంచాం.. ఫుడ్‌ మెనూ మారాలే

అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశం.. సిద్దిపేటలోని బీసీ గురకులం ఆకస్మిక సందర్శన

డైట్‌ చార్జీలు పెంచాం.. ఫుడ్‌ మెనూ మారాలే
X

డైట్‌ చార్జీలను పెంచామని.. దానికి అనుగుణంగా విద్యార్థులకు పెట్టే ఫుడ్‌ మెనూలోనూ మార్పులు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం సిద్దిపేటలోని మహాత్మాజ్యోతిరావు ఫూలే బీసీ గురుకులాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంఆ స్కూల్‌ ఆవరణలోని వంట గది, బాత్రూములు, టాయిలెట్లను పరిశీలించారు. స్కూల్‌ ఆవరణ ఎప్పుడూ శుభ్రంగా ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్కూల్‌లో వంట చేస్తున్న సిబ్బందితో మంత్రి మాట్లాడారు. అప్పటికే వండిన అన్నం, కూరలన పరిశీలించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడి ఆహారం, విద్యాబోధన ఎలా ఉందని ఆరా తీశారు. పేరెంట్‌, టీచర్స్‌ మీటింగ్‌ జరుగుతుందా అని అడిగి తెలుసుకున్నారు. జిల్లా స్థాయిలో డీఎంహెచ్‌వో, డీఆర్‌డీవో, డీపీవో, స్థానిక పంచాయతీ సెక్రటరీలతో కూడిన కమిటీ ప్రతి 15 రోజులకు ఒకసారి గురుకులాన్ని తనిఖీ చేయాలని ఆదేశించారు. ఆహార నాణ్యతలో ఏవైనా సమస్యలుంటే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు విధిగా వైద్య పరీక్షలు చేయించాలన్నారు. గురుకులం ఆవరణలో జామ, మునగ, కరివేప తదితర మొక్కలు నాటాలని సూచించారు.




ఫుడ్‌ పాయిజన్‌ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో గతంలో కన్నా మెరుగైన విద్య బోధన, భోజనం, వసతి సౌకర్యాలు కల్పించేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. స్కూళ్లలో ఏవైనా సమస్యలుంటే ప్రిన్సిపాల్స్‌ తమ జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. సీఎం సూచన మేరకు జిల్లా కలెక్టర్‌, అడిషనల్‌ కలెక్టర్‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్‌ అధికారులతో జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎక్కడా ఫుడ్‌ పాయిజన్‌ కు అవకాశం లేకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. గురుకుల విద్యార్థులకు టీచర్లు ధైర్యం ఇవ్వాలని.. వారు ఎదుర్కొనే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు టీచర్లు కృషి చేయాలన్నారు. గురుకులాలపై ఎవరూ రాజకీయాలు చేయొద్దన్నారు. గతంలో కిరాయిలు కట్టలేదని, మెస్‌ చార్జీలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని అన్నారు. భవిష్యత్‌ లో గ్రీన్‌ చానల్‌ ద్వారా మెస్‌ చార్జీలు చెల్లిస్తామన్నారు. విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలతో పాటు అన్ని రకాల కిట్స్‌ ఇస్తున్నామన్నారు. ప్రభుత్వానికి సూచనలు చేయాలే కానీ విద్యార్థులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయొద్దన్నారు. విద్యార్థి నాయకుడిగా తనకు అన్నింటిపైనా కన్సర్న్‌ ఉంటుందని తెలిపారు.

First Published:  28 Nov 2024 6:56 AM
Next Story