అధికారులు డబ్బులు పట్టుకున్నారా..? ఆధారాలుంటే ఇలా చేయండి
రెండు, మూడు రోజుల తనిఖీల్లోనే భారీగా బంగారం, నగదు పట్టుబడ్డాయి. అయితే ఇందులో చాలా వరకు బిల్లులు లేకుండా తరలిస్తున్న నగలు, ఎలాంటి ఆధారాలు లేని నగదు ఉండటం గమనార్హం.
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఓటర్లను ప్రలోభపెట్టడానికి అభ్యర్థులు డబ్బులు, తాయిలాలు పంచకుండా చూసే పనిలో ఎన్నికల కమిషన్ నిమగ్నమైంది. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి ఇక్కడికి డబ్బు, వస్తువుల అక్రమంగా తరలిరాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేస్తోంది. కర్నాటకలో ఓ కాంగ్రెస్ నేత ఇంట్లో అక్రమంగా దాచి ఉంచిన రూ.42 కోట్ల నగదు తెలంగాణ ఎన్నికల కోసం తరలించేందుకు సిద్ధం చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈసీ మరింత అప్రమత్తమై రాష్ట్రంలోకి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.
భారీగా నగదు, బంగారం స్వాధీనం
రెండు, మూడు రోజుల తనిఖీల్లోనే భారీగా బంగారం, నగదు పట్టుబడ్డాయి. అయితే ఇందులో చాలా వరకు బిల్లులు లేకుండా తరలిస్తున్న నగలు, ఎలాంటి ఆధారాలు లేని నగదు ఉండటం గమనార్హం. నిజంగా ఏదైనా అవసరాలకు డబ్బులు తీసుకెళుతున్నవాళ్లు కూడా పోలీసులు డబ్బులు స్వాధీనం చేసుకుంటే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. అందుకే సంబంధిత ఆధారాలు, ఆ డబ్బు బ్యాంకులో నుంచి తీసుకుంటే వాటి తాలూకా రసీదులు, ఏటీఎంలో నుంచి డ్రా చేస్తే వాటి రసీదులు, ఆభరణాలు, వస్తువులు కొంటే వాటి బిల్లులు దగ్గర పెట్టుకునే ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆధారాలు చూపిస్తే తిరిగిస్తారు
అధికారుల తనిఖీల్లో డబ్బు, బంగారం, ఇతర వస్తువులు పెద్ద సంఖ్యలో దొరికితే అధికారులకు వాటి ఆధారాలను పక్కాగా చూపించాలి. ఆస్పత్రికో, ఏదైనా స్థలమో, ఇల్లు కొనుగోలుకో, పిల్లల ఫీజులు కట్టడానికో, లేదంటే ఏదైనా వస్తువుల కొనుగోలుకో తీసుకెళుతుంటే అందుకు తగ్గ ఆధారాలు కచ్చితంగా చూపించాలి. ఒకవేళ చూపించకపోతే ఆయా ప్రాంతాల్లో దీనికోసం ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కమిటీకి మీ నగలు, నగదు వంటివి అప్పగిస్తారు. ఏదైనా వస్తువు కొన్నట్లో, ఫీజు కట్టినట్టో, ఆస్పత్రి బిల్లు కట్టినట్లో మీరు దేనికి వినియోగిస్తే అందుకు తగ్గ ఆధారాలను గ్రీవెన్స్ కమిటీకి సమర్పిస్తే మీ డబ్బులు, వస్తువులు తిరిగి ఇచ్చేస్తారు.