Telugu Global
Telangana

మహేశ్వరంలో సబిత, తీగల రాజీ పడ్డారా?

ఉప్పు-నిప్పులా ఉండే ఇరువర్గాలు ఒకే వేదికపై కనిపించడం టీఆర్ఎస్ కార్యకర్తల్లో కూడా ఉత్సాహాన్ని తెచ్చింది. కవిత కూడా ఇరు వర్గాలను సముదాయించిందని, టికెట్ ఎవరికి వచ్చినా మరొకరికి పార్టీ న్యాయం చేస్తుందని చెప్పినట్లు సమాచారం.

మహేశ్వరంలో సబిత, తీగల రాజీ పడ్డారా?
X

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో టీఆర్ఎస్ ముఖ్యనేతలు కలిసి పోయారా? తమలో తాము గొడవ పడితే అసలుకే మోసం వస్తుందని గ్రహించారా? ఇకపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కలిసి నడుద్దామని నిర్ణయించుకున్నారా? అంటే స్థానిక గులాబీ నేతలు అవుననే సమాధానం చెప్తున్నారు. 2009లో మహేశ్వరం నియోజకవర్గంగా ఏర్పడింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. పూర్తిగా నగరంలో కాకుండా.. నగర శివారులో ఉండటంతో ఇక్కడ ఓటర్ల ధోరణి కూడా కాస్త భిన్నంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గానికి మూడు సార్లు ఎన్నికలు జరుగగా.. రెండు సార్లు సబిత ఇంద్రారెడ్డి, ఒకసారి తీగల కృష్ణారెడ్డి గెలిచారు.

మహేశ్వరం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి కూడా గెలవలేదంటే మీరు నమ్ముతారా? కానీ అదే నిజం. సబిత ఇంద్రారెడ్డి 2009, 2018లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. ఇక 2014లో తీగల కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున గెలవడం విశేషం. కానీ ఇప్పుడు ఇద్దరూ అధికార టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. 2018లో సబిత కాంగ్రెస్ నుంచి గెలిచిన తర్వాత టీఆర్ఎస్‌లోకి మారిపోయి ఏకంగా మంత్రి అయ్యారు. దీంతో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన తీగల కృష్ణారెడ్డి ప్రభావం తగ్గిపోయింది. మంత్రి అనుచరులు నియోజకవర్గంలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తుండటంతో తీగల వర్గం సైలెంట్ అయిపోయింది. మంత్రి కొడుకు పటోళ్ల కార్తీక్ రెడ్డి కూడా షాడో ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో హల్ చల్ చేస్తున్నారు.

మంత్రి సబిత ఆధిపత్యం పెరిగిపోవడంతో తీగల కృష్ణారెడ్డి పార్టీ మారాలనే ఆలోచన చేశారు. ఆ మధ్య సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గ పరిధిలో కబ్జాలకు పాల్పడుతున్నారంటే ఏకంగా మీడియా ముందే ఆరోపించారు. ఒకే పార్టీలో ఉంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుండటంతో కార్యకర్తల్లో గందరగోళం మొదలైంది. ఈసారి ఎలాగైనా టీఆర్ఎస్ పార్టీ గెలవాలనే వ్యూహంతో ఉండగా.. ఇలా ఇద్దరు సీనియర్ నేతలు ఒకరిపై ఒకరు బురదజల్లుకోవడం మొదటికే మోసం వచ్చేలా తయారయ్యింది. ఒకానొక దశలో తీగల కృష్ణారెడ్డి పార్టీ మారాలని నిర్ణయం తీసుకోగా.. స్వయంగా కేటీఆర్ రంగంలోకి దిగి ఆయనను సముదాయించినట్లు తెలుస్తుంది.

ఇటీవల కల్వకుంట్ల కవిత కూడా ఇరు వర్గాలను కలిపే ప్రయత్నం చేసినట్లు సమాచారం. బాలాపూర్ వినాయక విగ్రహాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు కవిత వెంట మంత్రి కొడుకు కార్తీక్‌తో పాటు తీగల కృష్ణారెడ్డి కూడా ఉన్నారు. ఉప్పు-నిప్పులా ఉండే ఇరువర్గాలు ఒకే వేదికపై కనిపించడం టీఆర్ఎస్ కార్యకర్తల్లో కూడా ఉత్సాహాన్ని తెచ్చింది. కవిత కూడా ఇరు వర్గాలను సముదాయించిందని, టికెట్ ఎవరికి వచ్చినా మరొకరికి పార్టీ న్యాయం చేస్తుందని చెప్పినట్లు సమాచారం. బాలాపూర్ గణేష్ దర్శనం పేరుతో ఇరు వర్గాలను కలపడానికే కవిత వచ్చినట్లు స్థానిక రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా ఇద్దరు సీనియర్ నేతలు కలిసిపోవడం శుభపరిణామం అని టీఆర్ఎస్ కార్యక్తర్తలు వ్యాఖ్యానిస్తున్నారు.

First Published:  13 Sept 2022 5:00 PM IST
Next Story