Telugu Global
Telangana

కొండా విశ్వేశ్వర్ రెడ్డి రెండు పార్టీల్లో కర్చీఫ్‌ వేశారా..?

నిజానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరిగింది. అయితే ఆయనకు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఉండడంతో అప్పుడు కాంగ్రెస్‌లో చేరిక వాయిదా పడింది.

కొండా విశ్వేశ్వర్ రెడ్డి రెండు పార్టీల్లో కర్చీఫ్‌ వేశారా..?
X

తెలంగాణ రాజకీయాల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఇప్పుడు రెండు పడవలపై కాళ్లు పెట్టారని తెలుస్తోంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆయన గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఏ పార్టీ నుంచి అనేది సస్పెన్స్‌గా మారింది. ఎందుకంటే ఆయన వ్యవహారశైలే ఇందుకు కారణం. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆయన కాంగ్రెస్‌లోనూ కర్చీఫ్ వేశారన్న ప్రచారం జరుగుతోంది.

పార్లమెంట్‌ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆయన బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరతారని తెలుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితోనూ భేటీ అయ్యారని సమాచారం. కొండా చేరికకు రేవంత్ అంగీకరించినప్పటికీ.. బీజేపీ నుంచి బలమైన అభ్యర్థి ఉండకూడదన్న కారణంతోనే చివరి నిమిషం వ‌ర‌కు ఆ పార్టీలో ఉండాలని కొండా నిర్ణయించుకున్నారని సమాచారం. చివరినిమిషంలో బీజేపీకి హ్యాండ్ ఇస్తే ఆ పార్టీకి బలమైన అభ్యర్థి దొరకడనేది కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్లాన్‌గా తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌కు చేవెళ్లలో బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ.. ఎంపీ అభ్యర్థి లేడు. ఇక కొండా విశ్వేశ్వర్ రెడ్డి బలమైన అభ్యర్థి అయినప్పటికీ.. బీజేపీ చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలో అంత బలంగా లేదు.

నిజానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరిగింది. అయితే ఆయనకు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఉండడంతో అప్పుడు కాంగ్రెస్‌లో చేరిక వాయిదా పడింది. ఇక ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల సమీపిస్తుండడంతో మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలుస్తోంది.

2013లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆహ్వానంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి..2014 లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. 2018లో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. 2021లో మళ్లీ కాంగ్రెస్‌కు హ్యాండిచ్చిన కొండా.. 2022లో బీజేపీ గూటికి చేరారు. తాజాగా మరోసారి పార్టీ మారేందుకు ఆయన సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

First Published:  25 Jan 2024 10:43 AM IST
Next Story