Telugu Global
Telangana

రేవంత్‌ వర్సెస్‌ ఉత్తమ్‌.. గాంధీ భవన్‌లో రచ్చ..!

పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పార్టీలో రెండు టికెట్ల అంశాన్ని హైకమాండ్‌ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఇంతలోనే కలగజేసుకున్న రేవంత్‌ రెడ్డి.. తనకు ఏ విషయంలోనూ డిక్టేట్ చేయ్య‌వ‌ద్దన్నారు.

రేవంత్‌ వర్సెస్‌ ఉత్తమ్‌.. గాంధీ భవన్‌లో రచ్చ..!
X

తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల విషయంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌, మాజీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మధ్య డైలాగ్‌ వార్‌ నడిచింది. మంగళవారం జరిగిన ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ సమావేశంలో ఒకే కుటుంబంలో రెండు టికెట్ల అంశం చర్చకు వచ్చింది. ఈ విషయంపైనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఒకే కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వాలని తాను ఎప్పటికీ అధిష్టానానికి చెప్పనన్నారు రేవంత్ రెడ్డి. ఈ విషయంపై హై కమాండ్‌దే తుది నిర్ణయమని తేల్చి చెప్పారు. అయితే దీనిపై స్పందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పార్టీలో రెండు టికెట్ల అంశాన్ని హైకమాండ్‌ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఇంతలోనే కలగజేసుకున్న రేవంత్‌ రెడ్డి.. తనకు ఏ విషయంలోనూ డిక్టేట్ చేయ్య‌వ‌ద్దన్నారు. రేవంత్ మాటలకు నొచ్చుకున్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమావేశం మధ్యలో నుంచి ఆగ్రహంగా వెళ్లిపోయారు. ఈ సమావేశంలో అభ్యర్థులపై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో వచ్చే నెల 2న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.

ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ప్రస్తుతం నల్గొండ ఎంపీగా ఉన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన ఆయన.. హుజూర్‌నగర్‌ సీటు కోసం దరఖాస్తు చేశారు. ఆయన భార్య పద్మావతి కోదాడ స్థానం కోసం దరఖాస్తు పెట్టింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ నుంచి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోదాడ నుంచి ఉత్తమ్ పద్మావతి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ సారి కూడా రెండు స్థానాలు ఆశిస్తున్నారు.

దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 25న ముగియడంతో..ఈ దరఖాస్తులను పరిశీలించేందుకు ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ మంగళవారం సమావేశమైంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 1025 దరఖాస్తులందినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందులో 34 స్థానాలకు పదికిపైగా అర్జీలు అందాయి. అత్యధికంగా ఇల్లెందు స్థానానికి 36 మంది దరఖాస్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాలకు ఎక్కువగా పోటీ ఉన్నట్లు సమాచారం. బీసీ సామాజికవర్గం నుంచి కూడా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు దాఖలైనట్లు తెలుస్తోంది.

పార్టీ కచ్చితంగా గెలిచే అవకాశాలున్నాయని సర్వేల్లో గుర్తించిన నియోజకవర్గాలకు బీసీ, ఓసీ అభ్యర్థులు ఎక్కువగా పోటీపడుతున్నారు. అయితే ఒక్కో నియోజకవర్గానికి ఎన్ని దరఖాస్తులొచ్చినా.. ముగ్గురు అభ్యర్థుల పేర్లతో ఫైనల్‌ లిస్టు తయారు చేయాలని పార్టీ అధిష్టానం సూచించింది. ఈ ముగ్గురితో పాటు మిగతా దరఖాస్తుదారులకు ఆ ప్రాంతంలో ఉన్న బలంపై వారం, పది రోజుల్లో అంతర్గత సర్వే చేయించనున్నారు. ఈ సర్వే ఫలితాల ఆధారంగా స్క్రీనింగ్‌ కమిటీ.. ఆయా అభ్యర్థుల బలాబలాలను వివరిస్తూ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి రిపోర్టు పంపనుంది. అక్కడ చర్చించాక అభ్యర్థుల తుది జాబితాను కాంగ్రెస్‌ విడుదల చేయనుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే సెప్టెంబర్‌ 15 నాటికి 60 నుంచి 75 స్థానాలకు.. ఆ నెలాఖరుకు అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది.

*

First Published:  30 Aug 2023 1:00 AM GMT
Next Story