బీజేపీలో భగ్గుమన్న విభేదాలు.. ఎంపీ అర్వింద్‌పై తిరుగుబాటు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీజేపీకి మొదటి నుంచి యెండల లక్ష్మీనారాయణ పెద్ద దిక్కుగా ఉన్నారు. పార్టీని ఆయన ఒక్కరే భుజాలపై వేసుకొని నడిపించారు. అయితే అర్వింద్ నిజామాబాద్ ఎంపీగా గెలిచిన తర్వాత పార్టీలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.
బీజేపీలో మళ్లీ వర్గ పోరు మొదలైంది. నిజామాబాద్ జిల్లాలో రెండు వర్గాల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎంపీ అర్వింద్, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ మధ్య ఎప్పటి నుంచో ఉన్న విభేదాలు జిల్లా పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వారిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి గతంలో చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యవహార శైలితో విసిగిపోయిన చాలా మంది యెండల లక్ష్మీనారాయణ పంచన చేరుతున్నారు. దీంతో గతంలో తాను చెప్పిందే వేదంగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో అర్వింద్‌కు ఇప్పుడు వ్యతిరేకత కనపడుతోంది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీజేపీకి మొదటి నుంచి యెండల లక్ష్మీనారాయణ పెద్ద దిక్కుగా ఉన్నారు. పార్టీని ఆయన ఒక్కరే భుజాలపై వేసుకొని నడిపించారు. అయితే అర్వింద్ నిజామాబాద్ ఎంపీగా గెలిచిన తర్వాత పార్టీలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది బీజేపీలో చేరి అర్వింద్ వర్గంగా కొనసాగుతున్నారు. దీంతో మొదటి నుంచి ఉన్న యెండల హవా కాస్త తగ్గిపోయింది. అంతే కాకుండా జిల్లాలో అర్వింద్, యెండల వర్గాలుగా బీజేపీ విడిపోయింది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా యెండల ఉన్నా.. జిల్లాలో మాత్రం అర్వింద్ చెప్పిందే నడుస్తోంది. ఇది యెండలకు ఆగ్రహం తెప్పిస్తోంది.
జిల్లాలో యెండల, అర్వింద్ మధ్య పోరు తారా స్థాయికి చేరుకున్నది. పార్టీ పరంగా యెండల కార్యక్రమం చేపడితే అర్వింద్ రాకపోవడం. ఒక వేళ అర్వింద్ ఏదైనా ప్రోగ్రాం చేస్తున్నారంటే దానికి యెండల గైర్హాజరు కావడం సాధారణమైపోయింది. వీరిద్దరి మధ్య వర్గ పోరు తారా స్థాయికి చేరుకోవడంతో పార్టీకి తీరని నష్టం చేకూరుతోందని కార్యకర్తలే అంటున్నారు. పైగా ఇటీవల అర్వింద్ తన పలుకుబడిని ఉపయోగించి తన వర్గం వారికే ఇంచార్జి పదవులు ఇప్పించుకోవడం యెండల వర్గానికి పుండు మీద కారం చల్లినట్లుగా అయ్యింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని అర్వింద్.. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జి పదవులను తన వర్గం వారికే ఇప్పించుకున్నారు. నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల ఇంచార్జి పదవులు అర్వింద్ వర్గపు వారికే దక్కాయి. ఒక్క పదవి కూడా యెండల వర్గానికి రాకపోవడంతో జిల్లా బీజేపీలో మరోసారి అగ్గిపుట్టించింది.
ధర్మపురి అర్వింద్ అంతా తానై నడిపిస్తుండటంతో చాలా మంది ఆయనపై ఆగ్రహంగా ఉన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో 28 మంది కార్పొరేటర్లు గెలిచారు. అయితే బీజేపీలో ఉన్న వర్గ విభేదాల కారణంగా ఇప్పటికే 11 మంది టీఆర్ఎస్‌లో చేరిపోయారు. వాళ్లంతా అర్వింద్ కారణంగానే పార్టీని వీడారని యెండల వర్గం ఆరోపిస్తోంది. మరోవైపు మొదటి నుంచి అర్వింద్‌కు అండగా ఉన్న జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనారాయణ సైతం యెండల పంచన చేరినట్లు వార్తలు వస్తున్నాయి.
నిజామాబాద్ ఎంపీగా అర్వింద్ గెలవడానికి బస్వ చాలా కష్టపడ్డారని, అయితే చివరకు అతడిని కూడా పట్టించుకోక పోవడంతో బస్వ అతడితో అంటీ ముట్టనట్లు ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో బీజేపీలోని ఇద్దరు కీలక నేతల మధ్య విభేదాల కారణంగా కార్యకర్తల్లో గందరగోళం నెలకొన్నది. ఇప్పుడు ఎవరో ఒకరి పంచన చేరకపోతే పార్టీలో కొనసాగడం కష్టమని కార్యకర్తలు ఏదో ఒక వర్గంలో చేరిపోతున్నారు. మరి రాష్ట్ర నాయకత్వం ఇప్పటికైనా జిల్లాలో సీనియర్ నాయకుల మధ్య విభేదాలను పరిష్కరిస్తుందా లేదా అని దిగువ శ్రేణి నాయకత్వం ఎదురు చూస్తోంది.