ధరణిపై మాటల యుద్ధం.. కాంగ్రెస్ పై కేటీఆర్ ధ్వజం
ధరణిని రద్దు చేయడం కాంగ్రెస్ పార్టీ విధానమే అయితే, పార్టీ పరంగా చెప్పాలని శ్రీధర్ బాబుని డిమాండ్ చేశారు కేటీఆర్. ధరణి వల్ల రైతులకు లాభం లేదు, దాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ చెప్పగలదా అని ప్రశ్నించారు.
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య ధరణి పోర్టల్ విషయంలో మాటల యుద్ధం జరిగింది. ధరణి పోర్టల్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు చేసిన ఆరోపణలను మంత్రి కేటీఆర్ ఖండించారు. ధరణిని రద్దు చేయడం, ప్రగతి భవన్ ను బద్దలు కొట్టడం, బాంబులతో పేల్చేయాలనడం.. కాంగ్రెస్ విధానామా? అని ప్రశ్నించారు.
లోపాలు ఉంటే సరిచేస్తాం.. కానీ..!
ధరణి పోర్టల్ తో రైతులు సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. గత ఏడేళ్లలో తెలంగాణలో మొత్తం 30 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయితే, ధరణి వచ్చాక ఏడాదిన్నర కాలంలోనే 23.92 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయని చెప్పారు. అన్నీసవ్యంగా జరిగితే ఎవరూ మాట్లాడరని, ఏదో ఒక చిన్న లోపం జరిగితే భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని మండిపడ్డారు. లోపాలు ఉంటే కచ్చితంగా సరిచేస్తామని, అంతే కాని ధరణిని రద్దు చేయడం కుదరదన్నారు.
మీ పార్టీ విధానం చెప్పండి..
ధరణిని రద్దు చేయడం కాంగ్రెస్ పార్టీ విధానమే అయితే, పార్టీ పరంగా చెప్పాలని శ్రీధర్ బాబుని డిమాండ్ చేశారు కేటీఆర్. ధరణి వల్ల రైతులకు లాభం లేదు, దాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ చెప్పగలదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో లంచం లేకుండా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టారని, ఇప్పుడు కూడా అలాగే చేయమంటారా అన్నారు. రైతులను పీడించడం, వారి పట్ల కర్కశకంగా వ్యవహరించడమే కాంగ్రెస్ విధానమా అని ప్రశ్నించారు కేటీఆర్. శాసనసభను, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడొద్దని హితవు పలికారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధరణిని రద్దు చేస్తానంటూ ప్రకటనలిస్తున్నారని, మా అధ్యక్షుడు అలా మాట్లాడలేదని శ్రీధర్ బాబు చెబుతున్నాడని.. అసలు వారి మధ్య సమన్వయం ఉందా అంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. కాంగ్రెస్ నాయకులను ప్రజలు పట్టించుకోవడం లేదని, ఎన్నికల్లో వారికి డిపాజిట్లు కూడా రావడం లేదన్నారు. ప్రగతి భవన్ ను పేల్చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు దుర్మార్గంగా మాట్లాడుతున్నాడని, ఆ వ్యాఖ్యలను సమర్థిస్తూ ఇక్కడ వారి సభ్యురాలు మాట్లాడుతున్నారని చెప్పారు. అసలు కాంగ్రెస్ పార్టీకి ఒక వైఖరి అంటూ ఉందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల నోటినుంచి ఒక్క పాజిటివ్ మాట కూడా రావడం లేదని, అందుకే కాంగ్రెస్ పార్టీ కనపడకుండా పోతోందని విమర్శించారు.