మేడారం మహాజాతరకు ముందే జనజాతర
రెండేళ్లకోసారి మేడారంలో జరిగే మహాజాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచే కాకుండా ఒడిశా, జార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ఇలా దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు.
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఇంకా మూడు వారాలుంది. కానీ, జాతరకు ముందే ప్రతి ఆదివారం వనదేవతల చెంత జనజాతర సాగుతోంది. డిసెంబర్, జనవరి నెలల నుంచి ప్రతి ఆదివారం జనం వెల్లువలా తరలివస్తున్నారు. జనవరి చివరి ఆదివారంలో 2 లక్షల మందికి పైగా భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. ఇక నిన్న అయితే ఆ సంఖ్య మూడున్నర లక్షలు దాటినట్లు అంచనా.
21 నుంచి 24 వరకు మహాజాతర
రెండేళ్లకోసారి మేడారంలో జరిగే మహాజాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచే కాకుండా ఒడిశా, జార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ఇలా దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. గిరిజనుల ఆరాధ్యదైవం కావడంతో గిరిజనులే ఎక్కువగా వస్తుంటారు. ఆ మూడు రోజుల్లో వచ్చే భక్తులు కోట్లలో ఉంటారు.
రెండు, మూడు నెలల ముందు నుంచే పోటెత్తుతున్న జనం
జాతర రోజుల్లో ఇసకేస్తే రాలనంత జనం, కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ ఉంటాయి. దీంతో చాలామంది భక్తులు జాతరకు రెండు, మూడు నెలల ముందు నుంచే ముఖ్యంగా ఆదివారాల్లో వచ్చి మొక్కులు తీర్చుకోవడం గత నాలుగైదు ఏళ్లుగా బాగా పెరుగుతోంది. ఈ ఏడాది అది మరింత పీక్స్‌కు వెళ్లింది. నిన్నటి ఆదివారం వనదేవతల దర్శనానికి క్యూలైన్లలో గంటల కొద్దీ సమయం పట్టింది. రాత్రి 10 గంటల వరకు దర్శనాలు సాగాయంటే రద్దీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.