Telugu Global
Telangana

అభివృద్ది అంటే కుర్ కురే ప్యాకెట్లు పంచడం కాదు... కిషన్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజం

అభివృద్ధి అంటే కుర్కురే ప్యాకెట్ల పంపిణీ (లాక్‌డౌన్ సమయంలో) లేదా ప్యాసింజర్ లిఫ్ట్‌ల (సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో) ప్రారంభోత్సవం కాదని పేర్కొన్నకేటీఆర్, కిషన్‌రెడ్డి తెలంగాణ కోసం లేదా కనీసం సొంత నియోజకవర్గం కోసం చేసిందేమీ లేదని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదన్నారు.

అభివృద్ది అంటే కుర్ కురే ప్యాకెట్లు పంచడం కాదు... కిషన్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజం
X



తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధిపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను BRS వర్కింగ్ ప్రెసిడెంట్,IT మంత్రి KTR కొట్టిపారేశారు. రాష్ట్ర ప్రజలకు కనిపిస్తున్న‌ అభివృద్ధి కళ్ళు మూసుకున్న‌ బిజెపి నాయకుడికి కనిపించడం లేదన్నారు.

అభివృద్ధి అంటే కుర్కురే ప్యాకెట్ల పంపిణీ (లాక్‌డౌన్ సమయంలో) లేదా ప్యాసింజర్ లిఫ్ట్‌ల (సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో) ప్రారంభోత్సవం కాదని పేర్కొన్నకేటీఆర్, కిషన్‌రెడ్డి తెలంగాణ కోసం లేదా కనీసం సొంత నియోజకవర్గం కోసం చేసిందేమీ లేదని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదన్నారు.

కేటీఆర్ ఒక ప్రకటనలో, హైదరాబాద్‌లో అన్ని వైపులా అభివృద్ధి జరుగుతోందని, అయితే కిషన్‌రెడ్డితో పాటు బీజేపీ నేతలు మాత్రం తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇస్తున్నారన్నారు.

ఇప్పటి వరకు హైదరాబాద్‌లో అభివృద్ధి పనులకు తాము విడుదల చేసిన నిధులు కాకుండా బీజేపీ నేతలు చెబుతున్నట్లుగా కేంద్రం అదనంగా నిధులు విడుదల చేసి ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

అక్టోబర్ 2020 వరదల తర్వాత హైదరాబాద్‌కు విపత్తు సహాయానికి కిషన్‌రెడ్డి నిధులు ఇవ్వలేకపోయారని గుర్తు చేశారు.

"కిషన్ రెడ్డి నిస్సహాయ మంత్రి. కుర్కురే ప్యాకెట్లు పంపిణీ చేయడం, రైల్వే స్టేషన్లలో ప్యాసింజర్ లిఫ్ట్‌లను ప్రారంభించడం తప్ప, 2019లో తాను ఎన్నికైనప్పటి నుంచి తెలంగాణకు భారీ ప్రాజెక్టులు కానీ, అదనపు నిధులు కానీ తీసుకురాలేకపోయారు. ఆయన నియోజకవర్గానికి మంజూరైన నిధులను కూడా గుజరాత్‌కు తరలించారు.'' అని కేటీఆర్ ధ్వజమెత్తారు.

హైదరాబాద్‌లో ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ, వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం కింద రూ.5,660.57 కోట్ల విలువైన 47 పనులు చేపట్టామని, వాటిలో 32 పనులు పూర్తయ్యాయని చెప్పారు.

లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా ఉండేందుకు, జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.735 కోట్లతో, చుట్టుపక్కల మునిసిపల్ పరిధిలో రూ.985.45 కోట్లతో వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం కింద నాలాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు.

సికింద్రాబాద్‌లోని పికెట్‌ నాలాపై వంతెనతో పలు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా నివారించవచ్చని ఆయన సూచించారు.

CRMP కింద ఇందిరాపార్క్ నుండి VST ప్రధాన రహదారి వరకు, అశోక్‌నగర్ కూడలి నుండి RTC కూడలి వరకు, VST ప్రధాన రహదారి మీదుగా రామ్‌నగర్ నుండి బాగ్‌లింగంపల్లి వరకు, బాగ్‌లింగంపల్లిలో మూడు‍లైన్ల‌ బై-డైరెక్షనల్ ఇండిపెండెంట్ ఫ్లైఓవర్, రూ.423 కోట్లతో జూన్ 2023 నాటికి పూర్తవుతుందన్నారు.

అదే సమయంలో అంబర్‌పేట్‌లో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫ్లైఓవర్ పనులు మూడేళ్లు గడుస్తున్నా ఇంకా నత్తనడకన సాగుతున్నాయన్నారు కేటీఆర్.

First Published:  23 Dec 2022 8:14 AM IST
Next Story