Telugu Global
Telangana

MP టికెట్ల కోసం పోటీప‌డుతున్న వార‌సులు

త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఎంపీ ఎన్నిక‌లకు వార‌స‌త్వ పోరు వేగం పుంజుకుంది. సీనియ‌ర్ నేత‌ల కొడుకులు, బిడ్డ‌లు, సోద‌రులు ఇలా వార‌సులు టికెట్ రేసులోకి దూసుకొచ్చేశారు.

MP టికెట్ల కోసం పోటీప‌డుతున్న వార‌సులు
X

కాంగ్రెస్ అంటేనే వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు పుట్టిల్లు. ఢిల్లీ నుంచి గ‌ల్లీ దాకా ఆ పార్టీలో నాయ‌కులు, వారి త‌ర్వాత వారి వార‌సులు, ఆ త‌ర్వాత వారి వారసులు ఇలా త‌ర‌త‌రాలుగా వార‌స‌త్వ రాజ‌కీయం వ‌ర్ధిల్లుతూనే ఉంటుంది. ప‌దేళ్ల త‌ర్వాత తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్‌లో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఎంపీ ఎన్నిక‌లకు వార‌స‌త్వ పోరు వేగం పుంజుకుంది. సీనియ‌ర్ నేత‌ల కొడుకులు, బిడ్డ‌లు, సోద‌రులు ఇలా వార‌సులు టికెట్ రేసులోకి దూసుకొచ్చేశారు.

న‌ల్గొండ నుంచి షురూ

కాంగ్రెస్ పార్టీ కీల‌క నేత‌లంద‌రూ మోహ‌రించి ఉండే న‌ల్గొండ‌లో నేత‌ల వార‌సులు టికెట్ల కోసం ద‌ర‌ఖాస్తులు పెట్టారు. మాజీ మంత్రి జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి న‌ల్గొండ ఎంపీ సీటుకు అప్ల‌యి చేశారు. మ‌రోవైపు ఇదే స్థానంలో త‌న కుమార్తె శ్రీ‌నిధిరెడ్డిని బ‌రిలోకి దించాల‌ని మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి భావిస్తున్నారు. ఈ మేర‌కు శ్రీ‌నిధి చేత ద‌ర‌ఖాస్తు చేయించారు. భువ‌నగిరి ఎంపీ సీటు కోసం కోమటిరెడ్డి సోదరులలో పెద్దవాడైన కోమటిరెడ్డి మోహన్‌ రెడ్డి కుమారుడు కోమటిరెడ్డి పవన్‌రెడ్డి సైతం సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు.

మ‌ల్కాజ్‌గిరి నుంచి సీఎం సోద‌రుడు

మ‌రోవైపు సీఎం రేవంత్‌రెడ్డి సోద‌రుడు కొండ‌ల్‌రెడ్డి మ‌ల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ కోసం అప్ల‌యి చేశారు. ఇదే స్థానం నుంచి సినీ నిర్మాత బండ్ల గ‌ణేష్ కూడా టికెట్ అడుగుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కొడంగ‌ల్‌లో పోటీ చేసి ఓడిపోయిన రేవంత్‌రెడ్డి త‌ర్వాత ఆరు నెల‌ల‌కు జ‌రిగిన పార్లమెంట్ ఎన్నిక‌ల్లో మ‌ల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. కాబట్టి సిట్టింగ్ స్థానాన్ని త‌న సోద‌రుడికి ఇవ్వాల‌నే ఉద్దేశంలో సీఎం ఉన్న‌ట్లు చెబుతున్నారు.

సికింద్రాబాద్‌లో అంజ‌న్‌కుమార్ కొడుకు

మ‌రోవైపు సికింద్రాబాద్ లోక్‌స‌భ స్థానం నుంచి అభ్య‌ర్థిత్వం ఇవ్వాలంటూ సికింద్రాబాద్ డీసీసీ అధ్య‌క్షుడు అనిల్ కుమార్ యాద‌వ్ ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. అనిల్ సికింద్రాబాద్ మాజీ ఎంపీ, సీనియ‌ర్ కాంగ్రెస్ నేత అంజ‌న్‌కుమార్ యాద‌వ్ కుమారుడు కావ‌డం గ‌మ‌నార్హం. పెద్ద‌ప‌ల్లి నుంచి కాకా వెంక‌ట‌స్వామి వార‌సుడు గ‌డ్డం వంశీకృష్ణ టికెట్ ఆశిస్తున్నారు. ఇలా చాలామంది నేత‌ల వార‌సులు ఎంపీ టికెట్ల రేసులోకి వ‌చ్చారు. వీరిలో ఎంత‌మందికి టికెట్లు ద‌క్కుతాయో చూడాలి.

First Published:  7 Feb 2024 3:23 PM IST
Next Story