Telugu Global
Telangana

యాదగిరిగుట్ట వివాదం.. క్లారిటీ ఇచ్చిన భట్టి

బీఆర్ఎస్‌, బీఎస్పీ నేతలు ఈ వివాదంపై స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్‌.ఎస్. ప్రవీణ్‌ కుమార్ డిమాండ్ చేశారు.

యాదగిరిగుట్ట వివాదం.. క్లారిటీ ఇచ్చిన భట్టి
X

యాదాద్రి గుడిలో జరిగిన ఘటనపై స్పందించారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తాను కావాలనే చిన్న స్టూల్‌పై కూర్చున్నానని క్లారిటీ ఇచ్చారు. ఆ ఫొటోను ఉద్దేశపూర్వకంగానే సోషల్‌మీడియాలో వైరల్‌ చేస్తున్నారన్నారు భట్టి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌గా తాను రాష్ట్రాన్ని శాసిస్తున్నానన్నారు. తాను ఎవరికి తల వంచేవాడిని కాదన్నారు భట్టి. ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునేవాడిని కాదన్నారు. ఆత్మగౌరవాన్ని చంపుకునే మనస్తత్వం తనది కాదంటూ ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టారు.

అసలు ఏం జరిగింది.. యాదాద్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దంపతులు సోమవారం తొలి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టితో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు. అయితే వేదపండితులు ఆశీర్వచనం పలికే సమయంలో సీఎం రేవంత్‌ దంపతులకు ఇరువైపులా మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి ఎత్తైన పీటలపై కూర్చున్నారు. ఉత్తమ్‌ కుమార్ రెడ్డి పక్కనే తక్కువ ఎత్తున్న పీటపై కొండా సురేఖ కూర్చున్నారు. భట్టి మాత్రం మంత్రి కోమటిరెడ్డి పక్కన కింద కూర్చున్నట్లుగా కనిపించింది. ప్రోటోకాల్ ప్రకారం సీఎం పక్కన డిప్యూటీ సీఎం కూర్చోవాలి. కానీ, అలా జరగలేదు. దీంతో ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దళితుడైన భట్టిని ఉద్దేశపూర్వకంగానే అవమానించారంటూ ఆరోపణలు వచ్చాయి.

బీఆర్ఎస్‌, బీఎస్పీ నేతలు ఈ వివాదంపై స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్‌.ఎస్. ప్రవీణ్‌ కుమార్ డిమాండ్ చేశారు. ఇక ఈ వివాదంపై ఇప్పటికే యాదగిరిగుట్ట ఆలయ ఈవో రామకృష్ణారావు సైతం వివరణ ఇచ్చారు. భట్టి విక్రమార్క, కొండా సురేఖలను నేలపై కూర్చొబెట్టలేదని.. తక్కువ ఎత్తున్న పీటలపై కూర్చోవడంతో అలా కనిపించిందన్నారు.

First Published:  12 March 2024 3:36 PM IST
Next Story