కవిత, కేజ్రీవాల్‌లకు దక్కని ఊరట.. జ్యుడీషియల్ కస్టడీ పొడిగించిన కోర్టు
తన క్లయింట్‌కు బెయిల్ పొందేందుకు అన్ని అర్హతలున్నాయని కవిత తరఫు లాయర్ వాదించారు. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో అరెస్టు అవసరం లేదన్నారు.
మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. ఆమెకు జ్యుడీషియల్ రిమాండ్‌ను మరో 14 రోజుల పాటు పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మే 7 వరకు కవిత కస్టడీలోనే ఉండాల్సి ఉంటుంది. కవితతోపాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కూడా 14 రోజుల డిమాండ్ పొడిగిస్తూ కోర్టు తీర్పిచ్చింది.
ఇదే వ్యవహారంలో సీబీఐ పెట్టిన కేసులో బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ వేశారు. దానిపై సోమవారం రౌస్ అవెన్యూ కోర్టులో సోమవారం విచారణ జరిగింది. న్యాయమూర్తి మే2వ తేదీకి వాయిదా వేశారు. ఈడీ కస్టడీకి తీసుకున్న కేసులో బెయిల్ ఇవ్వాలన్న కవిత పిటిషన్‌పై నిన్న ఇదే కోర్టులో వాదనలు జరిగాయి. మంగళవారం ఆ వాదనలు కొనసాగాయి.
కవిత వాదనతో ఏకీభవించని కోర్టు
తన క్లయింట్‌కు బెయిల్ పొందేందుకు అన్ని అర్హతలున్నాయని కవిత తరఫు లాయర్ వాదించారు. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో అరెస్టు అవసరం లేదన్నారు. అంతేకాక కవిత బీఆర్ఎస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ అని, ఆమె ప్రచారానికి వెళ్లాల్సి ఉన్నందున బెయిల్ ఇవ్వాలని ఈడీ, సీబీఐ కేసుల్లో లాయర్ వాదించారు. అయితే కవిత పలుకుబడి కలిగిన వ్యక్తి అని ఆమె బయటికి వెళితే సాక్షులను ప్రభావితం చేస్తారన్న సీబీఐ న్యాయవాది వాదించారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును మే2కి వాయిదా వేశారు. అయితే ఈడీ కేసులో మాత్రం రిమాండ్‌ను మరో 14 రోజులపాటు పొడిగిస్తూ తాజాగా తీర్పిచ్చారు.