Telugu Global
Telangana

సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రశంసలతో ముంచెత్తిన ఢిల్లీ సీఎం కేజ్రివాల్

కంటి వెలుగు కార్యక్రమంలో తెలంగాణలో ఉన్న అందరికీ ఉచిత పరీక్షలు చేయడం తనను ఆశ్చర్యపరిచింది అన్నారు.

సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రశంసలతో ముంచెత్తిన ఢిల్లీ సీఎం కేజ్రివాల్
X

సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఢిల్లీ సీఎం కేజ్రివాల్ ప్రశంసల వర్షం కురిపించారు. ఢిల్లీ అసెంబ్లీ ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కంటి వెలుగు, సాగునీటి పారుదల రంగంలో జరుగుతున్న అద్బుత ప్రగతిని ఆయన వివరించారు. తాను స్వయంగా పరిశీలించిన విషయాలను చెబుతూ.. సీఎం కేసీఆర్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు తాను అక్కడకు వెళ్లానని.. ఆ రాష్ట్రాలోని ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు. కంటి వెలుగు కార్యక్రమంలో తెలంగాణలో ఉన్న అందరికీ ఉచిత పరీక్షలు చేయడం తనను ఆశ్చర్యపరిచింది అన్నారు. కేవలం పరీక్షలు నిర్వహించడమే కాకుండా.. అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాల పంపిణీ, ఆపరేషన్లు కూడా చేస్తున్నారని ఆయన చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలను చూసే ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాలని ఆయన సూచించారు.

మేము కూడా ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలో అమలు చేయాలని భావిస్తున్నట్లు కేజ్రివాల్ చెప్పారు. పంజాబ్‌లో సీఎం భగవంత్ మాన్ సింగ్‌ను కూడా అమలు చేయాలని చెప్పినట్లు కేజ్రివాల్ పేర్కొన్నారు. తెలంగాణలో సాగునీటి పారుదల రంగంలో కూడా అద్భుతమైన ప్రగతి సాధించిందని.. ఆ పనులు చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. పంజాబ్ సీఎం మాన్‌ను మరోసారి తెలంగాణ వెళ్లి ఆ పనులను పరిశీలించాలని కోరానని అన్నారు. పంజాబ్‌లో కూడా ఇలా సాగునీటి పారుదల రంగాన్ని అభివృద్ధి చేయాలని సూచించినట్లు కేజ్రివాల్ చెప్పారు.

ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రం ఎందుకు నేర్చుకోకూడదని కేజ్రివాల్ ప్రశ్నించారు. తప్పకుండా ఇలాంటి విషయాలు సహకారం అందించుకోవాలని ఆయన అన్నారు. ఇందు కోసం ఒక వేదిక కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇది కేవలం ప్రభుత్వాల వేదిక మాత్రమే అని.. ఇందులో ఎలాంటి రాజకీయ అంశాలకు తావు లేదని కేజ్రివాల్ స్పష్టం చేశారు. తెలంగాణ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నుంచి ఇతర రాష్ట్రాలు నేర్చుకొని.. అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

రాష్ట్రాల్లో మెరుగైన పాలన అందించాలంటే రాజకీయాలను పక్కన పెట్టాల్సిన అవసరం ఉందని కేజ్రివాల్ అన్నారు. కంటివెలుగు వంటి కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లోని పేదలకు అవసరం అని చెప్పారు. ఇక తాను ప్రతిపాదించిన 'ప్రోగ్రెసివ్ చీఫ్ మినిస్టర్స్ గ్రూప్' కేవలం ఒక పాలనా వేదిక మాత్రమేనని అన్నారు. పశ్చిమ బెంగాల్, బీహార్, కేరళ, తమిళనాడు, జార్ఖండ్, పంజాబ్, తెలంగాణ ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తూ లేఖలు పంపినట్లు తెలిపారు. ఇది ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రం నేర్చుకునే వేదిక అని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల పొత్తు కోసం మాత్రం కాదని స్పష్టం చేశారు.


First Published:  23 March 2023 7:11 AM IST
Next Story