దశాబ్ది ఉత్సవాలు.. రేపు 'సురక్ష దినోత్సవం'.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
'సురక్ష దినోత్సవం' రోజు పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో.. సందర్శకుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్ బాబు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 4న (ఆదివారం) పోలీస్ శాఖ 'సురక్ష దినోత్సవం' నిర్వహిస్తున్నది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. రాష్ట్ర రాజధానిలో 'హైదరాబాద్ సిటీ పోలీస్' ఆధ్వర్యంలో ఉదయం నుంచి అర్థరాత్రి వరకు పలు కార్యక్రమాలు జరుగనున్నాయి. పెట్రోలింగ్ కార్/బ్లూ కోల్ట్ ర్యాలీ, అంబేద్కర్ విగ్రహం వద్ద టెక్నాలజీ ఎగ్జిబిషన్, ఉమెన్ సేఫ్టీ కార్మివాల్, చార్మినార్ వరకు ఫుట్ మార్చ్ ఉంటుంది.
'సురక్ష దినోత్సవం' రోజు పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో.. సందర్శకుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్ బాబు తెలిపారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఉండే ప్రాంతాలు..
- ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సంజీవయ్య పార్కు నుంచి చార్మినార్ వరకు పెట్రోలింగ్ కార్లు, బ్లూ కోల్ట్ వాహనాల ర్యాలీ నిర్వహిస్తారు. దీంతో సంజీవయ్య పార్కు, బుద్ద భవన్, సెయిలింగ్ క్లబ్, చిల్డ్రన్స్ పార్క్, అంబేద్కర్ విగ్రహం, లిబర్టీ, బషీర్‌బాగ్, బీజేఆర్ విగ్రహం, ఆబిడ్స్, ఎంజే మార్కెట్, సిద్దిఅంబర్ బజార్, అఫ్జల్‌గంజ్, నయాపూల్, మదీనా, పత్తర్‌ఘట్టి, గుల్జార్‌హౌస్, ఛత్రినాక, చార్మినార్ వరకు ఆంక్షలు ఉంటాయి. ర్యాలీ జరుగుతున్న సమయంలో ఆయా జంక్షల వద్ద వాహనాలను నిలిపివేయనున్నారు.
- ట్యాంక్‌బండ్‌కు ఇరువైపులా.. పీవీఎన్ఆర్ మార్గ్, నల్లగుట్ట, ఇందిరా గాంధీ రోటరీ రూట్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆంక్షలు ఉంటాయి.
- ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ ఉమెన్ పోలీస్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో కార్నివాల్ నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్యాంక్‌బండ్‌పై వాహనాలకు అనుమతి ఉండదు.
- ఎంజే మార్కెట్ నుంచి చార్మినార్ వరకు రాత్రి 10 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య ఫుట్ మార్చ్ నిర్వహిస్తారు. ఇది జరిగే సమయంలో ఆ రూట్లో ట్రాఫిక్ పూర్తిగా నిలిపివేయనున్నారు.
- భారీ అంబేద్కర్ విగ్రహం వద్ద ట్రాఫిక్ సేఫ్టీ, యాంటీ డ్రగ్ క్యాంపెయిన్, సైబర్ సెక్యూరిటీ, ఉమెన్ సేఫ్టీ వంటి అంశాలపై ప్రదర్శనలు ఉంటాయి.
ఈ కార్యక్రమాలను వీక్షించాలనుకునే సందర్శకుల కోసం పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు. నెక్లెస్ రోడ్, మింట్ కాంపౌండ్ రూట్‌లో సింగిల్ లేన్ పార్కింగ్.. ఎన్టీఆర్ ఘాట్, ఎన్టీఆర్ గార్డెన్, రేస్ కోర్సు రోడ్డులో ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు.