కిషన్ రెడ్డి గారూ.. ప్రధానితో మాట్లాడి 'పాలమూరు-రంగారెడ్డి'కి జాతీయ హోదా ఇప్పించండి : మంత్రి శ్రీనివాస్ రెడ్డి
ప్రధాని మోడీ ఇక్కడ ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామనే వాగ్దానం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాలకు సాగు, తాగు నీటిని అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'పాలమూరు-రంగారెడ్డి' ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇప్పించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోడీ ఇక్కడ ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామనే వాగ్దానం చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
ట్రెయిన్ నెంబర్ 12862 కాచిగూడ - విశాఖపట్నం రైలును మహబూబ్‌నగర్ వరకు పొడిగించారు. ఈ రోజు తొలి సర్వీసును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌రెడ్డి మహబూబ్‌నగర్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగానే మంత్రి మాట్లాడుతూ.. దేవరకద్ర బ్రిడ్జి నిర్మాణం తర్వాత గేట్ పూర్తిగా మూసేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. దాన్ని ప్రజల కోసం తెరవాలని కోరారు. అలాగే వీరన్నపేట వద్ద కూడా సమస్య ఉందని.. దాన్ని కూడా పరిష్కరించాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున మేము సహకరిస్తున్నా.. రైల్వే అధికారులు మాత్రం సహకరించడం లేదని చెప్పారు. రైల్వే వ్యవస్థ వల్ల ప్రజలు ఇబ్బందులు కలుగకుండా చూసే బాధ్యత అందరికీ ఉందని అన్నారు. ఎన్ని సార్లు అధికారులను కలిసినా ఫలితం లేకుండా పోయిందని మంత్రి కిషన్ రెడ్డికి వివరించారు. కాగా, రైల్వే శాఖతో ఉన్న సమస్యను పరిష్కరించేలా చూస్తానని కిషన్ రెడ్డి చెప్పారు.
చిరకాల కోరిక నెరవేరింది..
మహబూబ్‌నగర్ నుంచి విజయవాడ, వైజాగ్ వెళ్లాలంటే డైరెక్ట్ ట్రెయిన్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చాన్నాళ్లుగా ఒక డైరెక్ట్ ట్రెయిన్ వెయ్యాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేశారు. కాచిగూడ-విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలు ఇప్పుడు మహబూబ్‌నగర్ వరకు పొడిగించడంతో పాలమూరు వాసుల చిరకాల కోరిక నెరవేరింది. ఈ రైలు ప్రతీ రోజు సాయంత్రం నాలుగు గంటలకు పాలమూరులో బయలుదేరి.. తర్వాతి రోజు ఉదయం 6.40 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
Flagged off the Train service between Mahabubnagar-Kachiguda-Visakhapatnam (Train No. 12862) along with Central Minister Kishan Reddy Garu & Other Dignitaries. pic.twitter.com/YGeaaCzpHF
— V Srinivas Goud (@VSrinivasGoud) May 20, 2023