Telugu Global
Telangana

3 రోజులు.. 4 స్థానాలు.. కాంగ్రెస్‌లో ఉత్కంఠ

కాంగ్రెస్‌ పెండింగ్‌లో ఉంచిన నాలుగు స్థానాల్లో మిర్యాలగూడ, సూర్యాపేట, తుంగతుర్తి, చార్మినార్ ఉన్నాయి. సీపీఎంతో పొత్తుపై చర్చలు జరుగుతుండటంతోనే మిర్యాలగూడను పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.

3 రోజులు.. 4 స్థానాలు.. కాంగ్రెస్‌లో ఉత్కంఠ
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ముగింపు గడుపు దగ్గరపడుతోంది. ఈ నెల 10తో గడువు ముగియనుంది. అయినా కాంగ్రెస్‌లో మాత్రం ఇప్ప‌టికీ నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల ఎంపిక‌ పెండింగ్‌లోనే ఉంది. ఈ నాలుగు స్థానాల్లో టికెట్ల పంచాయితీ ఎటూ తేలడం లేదు.

కాంగ్రెస్‌ పెండింగ్‌లో ఉంచిన నాలుగు స్థానాల్లో మిర్యాలగూడ, సూర్యాపేట, తుంగతుర్తి, చార్మినార్ ఉన్నాయి. సీపీఎంతో పొత్తుపై చర్చలు జరుగుతుండటంతోనే మిర్యాలగూడను పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఒకవేళ పొత్తు కుదరకపోతే మిర్యాలగూడ టికెట్‌ బత్తుల లక్ష్మారెడ్డికి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సూర్యాపేట టికెట్‌ ఎవరికీ దక్కుతుందనేది హాట్ టాపిక్‌గా మారింది. ఈ టికెట్‌ కోసం మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్‌ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎవరికి వారే టికెట్‌ తమదేనన్న ధీమాతో ఉన్నారు.

ఇక తెలంగాణలో చర్చనీయాంశంగా ఉన్న మరో సీటు తుంగతుర్తి. ఈ సీటు కోసం కూడా ఆశావహులు పెద్ద ఎత్తున ఉన్నారు. తుంగతుర్తిపై రాంరెడ్డి దామోదర్ రెడ్డికి పట్టు ఉండడంతో.. అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తోంది. సూర్యాపేట టికెట్‌ రాంరెడ్డికి ఇవ్వకుంటే తుంగతుర్తిలో ఆయన సూచించిన వారికి టికెట్ దక్కే అవకాశాలున్నాయి. తుంగతుర్తి నుంచి గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రాంరెడ్డి.

ఇక కాంగ్రెస్‌ పెండింగ్‌లో ఉంచిన మరో స్థానం చార్మినార్‌. ఈ నియోజ‌క‌వ‌ర్గ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ ఖాన్‌కు ఈసారి పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు MIM. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌లో చేరికపై ముంతాజ్‌ ఖాన్ ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. నామినేషన్ల గడువు ముగుస్తుండటంతో ఆశావహుల్లో టెన్షన్ పెరిగిపోతుంది. వీలైనంత త్వరగా అభ్యర్థిత్వం ఖరారు చేస్తే ప్రచారం చేసుకోవచ్చని ఆశావహులు భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఈ స్థానాలపై నాన్చుడు ధోరణి అవలంభిస్తోంది. అన్ని కుదిరితే ఇవాళ సాయంత్రానికి ఈ నాలుగు సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలున్నాయి.

First Published:  8 Nov 2023 8:21 AM IST
Next Story