నల్లగొండలో దారుణం.. వాటర్ ట్యాంకులో డెడ్‌బాడీ
ట్యాంకులో వాటర్ లెవల్ చెక్ చేసేందుకు వెళ్లిన సిబ్బందికి కుళ్లిపోయిన స్థితిలో డెడ్‌బాడీ కనిపించింది. వెంటనే మున్సిపాలిటీ సిబ్బంది డెడ్‌బాడీని వెలికి తీశారు.
నల్లగొండ పట్టణంలో దారుణం వెలుగు చూసింది. నల్లగొండ మున్సిపాలిటీ 11వ వార్డ్ పాతబస్తీ హిందుపూర్ వాటర్ ట్యాంకులో డెడ్‌బాడీ కనిపించడం స్థానికంగా సంచలనంగా మారింది. గత పది రోజులుగా ఇవే నీటిని మున్సిపాలిటీలోని ప్రజలు తాగుతున్నారని తెలుస్తోంది.
ట్యాంకులో వాటర్ లెవల్ చెక్ చేసేందుకు వెళ్లిన సిబ్బందికి కుళ్లిపోయిన స్థితిలో డెడ్‌బాడీ కనిపించింది. వెంటనే మున్సిపాలిటీ సిబ్బంది డెడ్‌బాడీని వెలికి తీశారు. ఆ డెడ్‌బాడీ స్థానిక హనుమాన్ నగర్‌కు చెందిన ఆవుల వంశీదిగా గుర్తించారు. 10 రోజుల నుంచి వంశీ కనిపించకుండా పోవడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. అయితే వంశీది ఆత్మహత్యా లేదా ఎవరైనా హత్య చేసి వాటర్ ట్యాంకులో పడేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక ట్యాంకు నుంచి సరఫరా అయిన నీటిని తాగిన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మున్సిపాలిటీ సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం నాగార్జున సాగర్‌లోనూ ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఎండల వేడికి దాహం తీర్చుకోవడానికి వెళ్లి పదుల సంఖ్యలో కోతులు వాటర్ ట్యాంకులో నీటమునిగి చనిపోయిన విషయం తెలిసిందే.