ఈటలను కలసిన డీసీపీ.. ప్రాణహాని వ్యాఖ్యలపై ఆరా
డీజీపీ ఆదేశాలతో డీసీపీ సందీప్.. శామీర్ పేటలోని ఈటల నివాసానికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. ఆయన భద్రత విషయంపై చర్చించారు. ఇంటి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈటల రాజేందర్ కు ప్రాణహాని ఉందని, ఆయన హత్యకు సుపారీ కూడా ఇచ్చారంటూ ఆయన భార్య జమున చేసిన ఆరోపణలను తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు డీజీపీ అంజనీకుమార్ ఈటల ఆరోపణలపై ఆరా తీస్తున్నారు. ఈటలను కలసి మాట్లాడాలని, ఆయన ఆరోపణలకు ఆధారాలు సేకరించాలంటూ మేడ్చల్ డీసీపీ సందీప్ రావుని ఆదేశించారు. డీజీపీ ఆదేశాలతో డీసీపీ సందీప్.. శామీర్ పేటలోని ఈటల నివాసానికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. ఆయన భద్రత విషయంపై చర్చించారు. ఇంటి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈటల ఏం చెప్పారంటే..?
ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డితో తనకు ప్రాణహాని ఉందని డీసీపీ సందీప్ కి చెప్పారు ఈటల రాజేందర్. అందుకే రెండు రోజుల క్రితం తన భార్య ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేశారని వివరించారు. ఈటలతో మాట్లాడిన డీసీపీ పూర్తి వివరాలతో డీజీపీకి నివేదిక ఇవ్వబోతున్నారు.
ఈటల జమున ఆరోపణలను ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అదేరోజు ఖండించారు. ఈటల నుంచి తనకే ప్రాణహాని ఉందని ఆరోపించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కేటీఆర్ ఈటల వ్యవహారంలో స్పందించారు. హత్యాయత్నం ఆరోపణల నేపథ్యంలో ఈటలకు భద్రత పెంచాలని డీజీపీని ఆదేశించారు. దీంతో పోలీసులు ఈ వ్యవహారంలో నేరుగా ఈటల ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు.
రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు, పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత తమదేనన్నారు డీజీపీ అంజనీకుమార్. రాష్ట్రంలో హత్యారాజకీయాలకు చోటే లేదని స్పష్టం చేశారు.