Telugu Global
Telangana

నిందితుల్ని శిక్షించండి.. మా పిల్లల్ని రక్షించండి

ఇప్పటికిప్పుడు స్కూల్ అనుమతి రద్దు చేసి, పిల్లల్ని పక్క స్కూళ్లలో చేర్పించాలంటే వారి అకడమిక్ ఇయర్ దెబ్బతింటుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కనే ఉన్న స్కూల్స్ లో స్టేట్ సిలబస్ మాత్రమే చెబుతున్నారని, తమ పిల్లలు నష్టపోతారని అంటున్నారు.

నిందితుల్ని శిక్షించండి.. మా పిల్లల్ని రక్షించండి
X

LKG విద్యార్థినిపై లైంగిక దాడి వ్యవహారంలో హైదరాబాద్ లోని బంజారాహిల్స్ DAV స్కూల్ అనుమతి రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ స్కూల్ లో చదువుతున్న పిల్లల్ని ఇతర స్కూళ్లకు పంపించేలా చర్యలు తీసుకోవాలని, ఫీజు తిరిగి ఇప్పించేలా చేయాలని, తల్లిదండ్రుల అనుమానాలు నివృత్తి చేయాలంటూ డీఈవోకి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలిచ్చారు. అయితే పేరెంట్స్ యూనియన్లు మాత్రం తమ పిల్లలకు ఈ ఏడాది వరకైనా అక్కడే చదువుకునే వెసులుబాటు ఇప్పించాలని కోరుతున్నారు.

నిందితుల్ని శిక్షించండి..

బాలికపై లైంగిక దాడి చేసిన ప్రిన్సిపల్ కారు డ్రైవర్ ని, ఆ విషయంలో మౌనంగా ఉన్న ప్రిన్సిపల్ పై కూడా కేసులు పెట్టి రిమాండ్ కి పంపించారు పోలీసులు. ఆ దుర్మార్గుడు గతంలో కూడా చాలామంది పిల్లల్ని ఇలాగే లైంగికంగా వేధించేవాడని విచారణలో తేలింది. సీసీ కెమెరాలు పనిచేయని ప్రాంతంలో డిజిటల్ రూమ్ ఏర్పాటు చేసుకుని, చిన్నారులను అక్కడికి తీసుకెళ్లేవాడని పోలీసులు నిర్థారించారు. ఈ వ్యవహారం ప్రిన్సిపల్ కి తెలిసినా ఆమె అడ్డుకోలేదని తేలడంతో ఆమెపై కూడా కేసు పెట్టారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా పరిగణించి స్కూల్ అనుమతి రద్దు చేసింది. అయితే తల్లిదండ్రులు మాత్రం నిందితుల్ని శిక్షించాలని, తమ పిల్లల చదువు ఆగిపోకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

బంజారాహిల్స్ DAV స్కూల్ లో పిల్లలకు బాగా చదువు చెబుతారనే పేరుంది. స్టాండర్డ్స్ బాగున్నాయని చుట్టుపక్కలవారు ఈ స్కూల్ కి పంపించేవారు. సెంట్రల్ సిలబస్ లో ఇక్కడ విద్యాబోధన జరిగేది. ఇప్పటికిప్పుడు స్కూల్ అనుమతి రద్దు చేసి, పిల్లల్ని పక్క స్కూళ్లలో చేర్పించాలంటే వారి అకడమిక్ ఇయర్ దెబ్బతింటుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కనే ఉన్న స్కూల్స్ లో స్టేట్ సిలబస్ చెబుతున్నారని, తమ పిల్లలు నష్టపోతారని అంటున్నారు. స్టాఫ్ ని మార్చేసి, సీసీ కెమెరాల నిఘా పెంచి, ఇదే స్కూల్ ని తిరిగి ప్రారంభించాలంటున్నారు. ప్రస్తుతం అధికారులు పేరెంట్స్ తో చర్చలు జరుపుతున్నారు. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

First Published:  23 Oct 2022 11:45 AM GMT
Next Story