Telugu Global
Telangana

కేసీఆర్ కి నోటీసులివ్వడంపై భగ్గుమన్న బీఆర్ఎస్ నేతలు

బీఆర్ఎస్ హయాంలో ప్రతి ఇంటికి, ప్రతి పరిశ్రమకు నిరంతర విద్యుత్తు సరఫరా జరిగిందని, అందువల్లే అభివృద్ధి సాధ్యమైందని అన్నారు దాసోజు శ్రవణ్. అభివృద్ధి ప్రదాత కేసీఆర్ కి నోటీసులిస్తారా? అని నిలదీశారు.

కేసీఆర్ కి నోటీసులివ్వడంపై భగ్గుమన్న బీఆర్ఎస్ నేతలు
X

పగ, ప్రతీకార రాజకీయాలకు, కుయుక్తులకు పరాకాష్టగా తెలంగాణలో కాంగ్రెస్ పాలన మారిపోయిందని మండిపడ్డారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పవర్ కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. విద్యుత్ లోటుతో సతమతమవుతున్న రాష్ట్రానికి, మిగులు విద్యుత్తు అందించి వెలుగులు విరజిమ్మే తెలంగాణగా తీర్చిదిద్దినందుకు కేసీఆర్ కి సంజాయిషీ నోటీసులిచ్చారా..? అని ప్రశ్నించారాయన. తెలంగాణ రైతాంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్తు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపినందుకు నోటీసులిచ్చారా? అని అడిగారు దాసోజు శ్రవణ్.


బీఆర్ఎస్ హయాంలో ప్రతి ఇంటికి, ప్రతి పరిశ్రమకు నిరంతర విద్యుత్తు సరఫరా జరిగిందని, అందువల్లే అభివృద్ధి సాధ్యమైందని అన్నారు దాసోజు శ్రవణ్. అభివృద్ధి ప్రదాత కేసీఆర్ కి నోటీసులిస్తారా? అని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రతీకార రాజకీయాలను పక్కనపెట్టి, ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని హితవుపలికారు. గత ప్రభుత్వంలో మాదిరిగా 24 గంటల విద్యుత్తు సరఫరా చేయాలని ప్రజలు కాంగ్రెస్ నేతల్ని డిమాండ్ చేస్తున్నారని, అది చేతకాక ఇలా గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం సరికాదన్నారు శ్రవణ్.

హామీల అమలు చేతకాని గుంపుమేస్త్రీగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ సంజాయిషీ, ప్రతీకార రాజకీయాలకు తెరలేపారంటూ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు దాసోజు శ్రవణ్. రుణ మాఫీ, రైతు భరోసా, రూ.4 వేల పెన్షన్, నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలు, మహిళకు 2500 రూపాయల ఆర్థిక సాయం వంటి పథకాలు అమలు చేయడం చేతగాక, కేసీఆర్ బద్నాం చేయాలని చూడటం దురదృష్టకరం అన్నారు. రాజకీయ కుయుక్తులను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ నేతలు కృషి చేయాలన్నారు శ్రవణ్.

First Published:  13 Jun 2024 5:14 PM IST
Next Story