Telugu Global
Telangana

బానిసత్వాన్ని భరించలేను.. అందుకే పార్టీ నుంచి బయటికి.. - దాసోజు శ్రవణ్

రేవంత్ దగ్గర తిరుమల తరహాలో ఎల్ 1, ఎల్ 2 , ఎల్ 3 దర్శనాలు ఉంటాయని ఆయన ఫైర్ అయ్యారు. ఇక వీటిని తట్టుకునే శక్తి తనకు లేదని.. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి , పదవులకు రాజీనామా చేస్తున్నట్లు శ్ర‌వ‌ణ్‌ తెలిపారు.

బానిసత్వాన్ని భరించలేను.. అందుకే పార్టీ నుంచి బయటికి.. -  దాసోజు శ్రవణ్
X

టీ కాంగ్రెస్‌లో అగ్రకుల దురహంకారం నడుస్తోందని.. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమని దాసోజు శ్రవణ్ అన్నారు. తెలంగాణలో బీసీ, ఎస్సీలు కాంగ్రెస్ పార్టీకి దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే.. అలాంటి నేతలపై తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నామరూపాల్లేకుండా చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. తమవర్గం నేతల్ని బలమైన నాయకులుగా చిత్రీకరిస్తూ.. ఇతరులు బలహీనులనే ముద్రవేస్తున్నారని శ్రవణ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

సొంతపార్టీ వాళ్లే కాంగ్రెస్‌లోని నేతల్ని బలహీనపరుస్తున్నారని.. సొంత ముఠాతో కాంగ్రెస్‌ను హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారని శ్రవణ్ ఆరోపించారు. ఏఐసీసీ నుంచి ఒక ఫ్రాంచైజీ తీసుకున్నట్లు రేవంత్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మాఫియాను నడిపినట్లుగా పార్టీని నడుపుతున్నారని శ్రవణ్ ఆరోపించారు.

తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయడం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ వల్ల కాదన్నారు. రేవంత్ దగ్గర తిరుమల తరహాలో ఎల్ 1, ఎల్ 2 , ఎల్ 3 దర్శనాలు ఉంటాయని ఆయన ఫైర్ అయ్యారు. ఇక వీటిని తట్టుకునే శక్తి తనకు లేదని.. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి , పదవులకు రాజీనామా చేస్తున్నట్లు శ్ర‌వ‌ణ్‌ తెలిపారు.

రేవంత్, మాణిక్కం, సునీల్ కుమ్మక్కు..

2014లో తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని.. ముగ్గురు పీసీసీ చీఫ్‌ల నేతృత్వంలో పనిచేశానని దాసోజు చెప్పారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు అందుకున్న తర్వాత పార్టీలో రాజకీయం అంటే కులం, ధనం అనే అరాచకమైన పరిస్థితులు.. సామాజిక న్యాయ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా టీపీసీసీలో దుర్మార్గమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయన్నారు.

ఈ పరిణామాలు తనను తీవ్రంగా కలచివేశాయని.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని శ్రవణ్ ఆవేదన వ్యక్తంచేశారు. సోనియా, రాహుల్‌ల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా రేవంత్ పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల వ్యూహకర్త సునీల్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారని ఆయన ధ్వజమెత్తారు.

First Published:  5 Aug 2022 2:34 PM GMT
Next Story